logo

సంకల్పంతో మెరిసి.. ప్రతిభతో మురిసి..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్తీర్ణత ఒక్కటే సరిపోదు. మంచి మార్కులు సాధించాలి. మరోవైపు అన్ని రంగాల్లోనూ ప్రతిభ చాటితేనే ఉజ్వల భవిత సాధ్యం.

Published : 04 Dec 2022 02:01 IST

జాతీయ శిబిరాల్లో సత్తా చాటిన విద్యార్థులు
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్తీర్ణత ఒక్కటే సరిపోదు. మంచి మార్కులు సాధించాలి. మరోవైపు అన్ని రంగాల్లోనూ ప్రతిభ చాటితేనే ఉజ్వల భవిత సాధ్యం. లేదంటే ఎన్ని డిగ్రీలు పూర్తిచేసినా ఫలితం ఉండదు. ఉపాధి, ఉద్యోగాలకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు. దీన్ని గుర్తించే వారు అరుదుగా ఉంటారు. అన్నింటా రాణిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతారు. అందుకు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వేదికగా చేసుకొని తమ ఆసక్తితో పలువురు రాణిస్తుండటం విశేషం.

ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ..

మన దేశం వివిధ భాషలు, సంస్కృతులకు నిలయం. జాతీయ సమైక్యత నిరంతరం కొనసాగించడం ముఖ్యం. ఇందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జాతీయ సమైక్యతా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనాలన్నది ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ల కల. ఇందుకు ఎంతో శ్రమించాలి. పట్టుదలతో అడుగేయాలి. మరోవైపు రిపబ్లిక్‌ పరేడ్‌కు ప్రాతినిధ్యం వహించాలన్నది ఎన్‌సీసీ కేడేట్ల ధ్యేయం. దీన్ని సాధించేందుకు వివిధ దశలను దాటుకుంటూ రావాల్సిందే. ఈ సంకల్పంతో అడుగేసి పలువురు విద్యార్థులు సాధించి తమ సత్తా చాటారు.


ఉత్తమ వాలంటీర్లుగా..

హరియాణా రాష్ట్రం కురుక్షేత్రలో గత నెలలో జాతీయ సమైక్యత శిబిరం జరిగింది. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇందులో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. పవన్‌గౌడ్‌, కల్పన ప్రతిభతో ఆకట్టుకున్నారు. శిబిరంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై తమ ప్రదర్శనలతో నిర్వాహకులను ఆకట్టుకున్నారు. ప్రశంసలు అందుకున్నారు. పతకాలు సొంతం చేసుకున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాలంటీర్లు పాల్గొని తమదైన రీతిలో ప్రదర్శించారు. పవన్‌గౌడ్‌, కల్పనలు ఉత్తమ వాలంటీర్లుగా నిలిచారు.


తొలి స్థానంలో..

గజ్వేల్‌ బాలుర విద్యాసౌధంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న మధు ఆర్డీ పరేడ్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుత విద్యాసంవత్సరం జూన్‌ నుంచి ఇప్పటి వరకు 80 రోజుల పాటు రాష్ట్రంలోని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌తో పాటు ఏపీలోని తిరుపతిలో నిర్వహించిన ఎన్‌సీసీ క్యాంపుల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. కళాశాలలో ఎన్‌సీసీ సీనియర్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. గతేడాది ఉత్తమ కేడేట్‌గా గుర్తింపు సాధించారు. తద్వారా ఆర్డీలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు.

న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ


బృందానికి నేతృత్వం

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం కార్యక్రమాల్లో భాగంగా జాతీయ సమైక్యత శిబిరం ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి ఈ సారి చేపట్టిన శిబిరానికి 30 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఈ బృందానికి కాంటిజెంట్‌ లీడర్‌గా తారా కళాశాలకు చెందిన పద్మజ వ్యవహరించారు. పక్కా కార్యాచరణతో విద్యార్థులు ప్రతిభ చాటేలా దిశానిర్దేశం చేశారు. శిబిరం నిర్వహణలో భేష్‌ అనిపించుకున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని