logo

దైవదర్శనానికి వెళ్లొస్తూ.. ఒకరి మృతి

బంధువలందరూ కలిసి దైవ దర్శనానికి బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో మృత్యురూపంలో దూసుకొచ్చిన గుర్తుతెలియని ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడగా ఒకరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు.

Published : 04 Dec 2022 02:01 IST

15 మందికి గాయాలు

సురేష్‌

చేగుంట, వెల్దుర్తి, తూప్రాన్‌, న్యూస్‌టుడే: బంధువలందరూ కలిసి దైవ దర్శనానికి బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో మృత్యురూపంలో దూసుకొచ్చిన గుర్తుతెలియని ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడగా ఒకరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా చేగుంట ఠాణా పరిధి మాసాయిపేట శివారులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నాచారం, మనోహరాబాద్‌ మండలం దండుపల్లికి చెందిన నంబి సురేష్‌ (30), ఆయన భార్య కవిత, కూతుళ్లు దీక్షిత, చరిత, కుమారుడు చరణ్‌తో పాటు బండ్ల లక్ష్మణ్‌, వసంత, సుధీర్‌, హర్షవర్ధన్‌, యశస్వి, దివ్య, పశువుల అక్షర, బండారి నర్సమ్మ, సాలమ్మ, పోచయ్య, నాగేంద్రలు కలిసి టాటా ఏస్‌ వాహనంలో శుక్రవారం పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి వెళ్లారు. అక్కడ సురేష్‌ బావమరిది కుమారుడి పుట్టువెంట్రుకలు తీశారు. ఆ రోజు రాత్రి అక్కడే నిద్ర చేసి శనివారం తెల్లవారుజామున దండుపల్లికి బయల్దేరారు. దండుపల్లికి చెందిన కనకరాజు నడిపిస్తున్నాడు. మాసాయిపేట శివారు చెట్లతిమ్మాయిపల్లి క్రాస్‌రోడ్డు దాటగానే నిజామాబాద్‌ వైపు నుంచి అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో టాటాఏస్‌ వాహనం రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తాపడింది. అందులో ఉన్న నంబి సురేష్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా 15 మంది గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను తూప్రాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి ఇద్దరు కుమార్తెలు దీక్షిత, చరిత, అక్కాచెల్లెలు నర్సమ్మ, సాలమ్మ, తండ్రి కొడుకులు లక్ష్మణ్‌, సుధీర్‌లు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉండటంతో కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ప్రవీణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. క్షతగాత్రులను జడ్పీ ఛైర్‌పర్సన్‌ హేమలత ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రమాదంలో సురేష్‌ మరణించగా అతడి కుమార్తెలు దీక్షిత, చరిత తీవ్రంగా గాయపడ్డారు. వారికి తండ్రి మరణవార్త తెలియకపోవడం గమనార్హం. సురేష్‌ భార్య కవిత పరిస్థితి అయోమయంగా ఉంది. బంధువులు ఆమెను భర్త అంత్యక్రియల కోసం నాచారానికి తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని