logo

విద్యా వాలంటీర్లు లేక.. బోధన సాగక..

అందోలు మండలం నేరడిగుంటలో గణితం, సాంఘికశాస్త్రం, తెలుగు సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాత్కాలికంగా ఎస్జీటీ ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసి బోధన చేయిస్తున్నారు.

Published : 04 Dec 2022 02:01 IST

ఉపాధ్యాయ ఖాళీలతో పిల్లలకు ఇబ్బందులు
న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, జోగిపేట టౌన్‌, కంగ్టి, మనూరు

* అందోలు మండలం నేరడిగుంటలో గణితం, సాంఘికశాస్త్రం, తెలుగు సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాత్కాలికంగా ఎస్జీటీ ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసి బోధన చేయిస్తున్నారు.

* నాగల్‌గిద్ద మండలం కారాముంగి జడ్పీ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులుండగా.. ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

* కంగ్టి జడ్పీ ఉన్నత పాఠశాలలో 535 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ 12 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. మరో 10 మంది అవసరం. తడ్కల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం విద్యా వాలంటీర్లను నియమించకపోవడం సమస్యగా మారింది. పిల్లలకు బోధనపై ప్రభావం చూపుతోంది.

1,328 మంది అవసరం

జిల్లాలో 864 ప్రాథమిక, 199 ప్రాథమికోన్నత, 203 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 1.27 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో 4,927 మంది ఉపాధ్యాయులు బోధిస్తుండగా.. 1328 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరి స్థానంలో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన వారిని విద్యా వాలంటీర్లుగా నియమిస్తే విద్యార్థులకు అన్ని సబ్జెక్టు బోధించేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువులో వెనుకబడినట్లు వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. చాలా చోట్ల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడం.. ఉన్న ఉపాధ్యాయులనే సర్దుబాటు చేయడంతో పిల్లలకు పాఠాలు అర్థం కావడం లేదు. విద్యాశాఖ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది.

పది విద్యార్థులపై ప్రభావం

ప్రతి విద్యార్థికి పదో తరగతి కీలకం. చాలా పాఠశాలల్లో కొన్ని సబ్జెక్టులు బోధించేందుకు ప్రత్యేక ఉపాధ్యాయులు లేకపోవడం వీరి చదువులపై ప్రభావం చూపుతోంది. కీలకమైన పాఠ్యాంశాలకు ఉపాధ్యాయులు లేకపోవడంతో.. నేర్చుకోలేకపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల్లో విద్యా వాలంటీర్లను నియమిస్తే కొంతమేరకైనా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది.

సర్దుబాటు చేస్తున్నాం..: రాజేశ్‌, జిల్లా విద్యాధికారి

జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. అలాంటి వాటిని గుర్తించి అవసరమైన చోట డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులను ఇప్పటికే నియమించాం. ఇంకా ఎక్కడైనా అవసరమని ప్రధానోపాధ్యాయులు కోరితే అర్హులైన ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం. పదో తరగతి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని