logo

ఆత్మహత్యకు ప్రేరేపణ.. కౌన్సిలర్‌పై కేసు

ఆటోడ్రైవరు ఆత్మహత్యకు కారకుడైన వార్డు కౌన్సిలర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిద్దిపేట త్రీ టౌన్‌ సీఐ భానుప్రకాశ్‌ వెల్లడించారు.

Published : 07 Dec 2022 01:19 IST

సిద్దిపేట, న్యూస్‌టుడే: ఆటోడ్రైవరు ఆత్మహత్యకు కారకుడైన వార్డు కౌన్సిలర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిద్దిపేట త్రీ టౌన్‌ సీఐ భానుప్రకాశ్‌ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు.. తనకు ఇల్లు దక్కకుండా అధికార పార్టీ కౌన్సిలర్‌ అడ్డుకుంటున్నాడనే ఆవేదనతో పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్‌ శిలాసాగర్‌ రమేశ్‌ సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ఆవరణలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు సెల్ఫీవీడియో తీసుకొని కౌన్సిలర్‌ పేరును ప్రస్తావించాడు. మూడేళ్ల కిందట రమేశ్‌ భార్య లలితకు పొరుగుసేవల కింద జీఎన్‌ఎం ఉద్యోగం ఇప్పిస్తానంటూ 26వ వార్డుకు చెందిన కౌన్సిలర్‌ ప్రవీణ్‌ వారి నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో గొడవలు జరిగాయి. దీంతో కౌన్సిలర్‌.. అధికారులు రెండు పడకల ఇల్లు కేటాయించిన క్రమంలో ఏదో ఒకటి సాకుగా చూపుతూ పట్టా రాకుండా అడ్డుకున్నాడు. మనస్తాపానికి గురైన రమేశ్‌ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్‌పై రమేశ్‌ భార్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ వివరించారు.

గతంలోనూ ఓ వీడియో..

గతంలోనూ ఓ వీడియోలో రమేశ్‌ తనకు ఇల్లు రాకుంటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. జాబితాలో తన పేరు వచ్చినా కౌన్సిలర్‌ ప్రవీణ్‌ తనపై పగతో రాకుండా చేశాడని ఓ వ్యక్తితో సదరు వీడియోలో వాపోయాడు. సిద్దిపేట సర్వజన ఆసుపత్రిలో రమేశ్‌ మృతదేహానికి సోమవారం అర్ధరాత్రి తరువాత పోస్టుమార్టం చేశారని, అడ్డుకోబోతే తమను అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా పంపించారని బాధిత బంధువులు ‘న్యూస్‌టుడే’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటిగంట ప్రాంతంలో పోస్టుమార్టం ప్రక్రియ చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసు వాహనంలో తరలించారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని