logo

ఆయకట్టు సాగుకు నీరందేనా..?

ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని జలవనరులు నిండు కుండను తలపిస్తున్నాయి. యాసంగి సాగు జోరుగా ఉంటుందని అన్నదాతలు ఆనందపడ్డారు.

Updated : 07 Dec 2022 06:27 IST

మరమ్మతులకు నోచక ఇబ్బందులు
న్యూస్‌టుడే, చేగుంట, వెల్దుర్తి, పాపన్నపేట, హావేలిఘనపూర్‌, నర్సాపూర్‌ రూరల్‌, శివ్వంపేట, టేక్మాల్‌,  చిలప్‌చెడ్‌

హల్దీ ప్రాజెక్టు ఎడమ కాలువ దుస్థితి

ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని జలవనరులు నిండు కుండను తలపిస్తున్నాయి. యాసంగి సాగు జోరుగా ఉంటుందని అన్నదాతలు ఆనందపడ్డారు. ప్రస్తుతం వరి సాగుకు సన్నద్ధమవుతుండగా కొందరు నారుమళ్లు పోశారు. ఎరువులు, పురుగు మందులు సిద్దం చేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయకట్టు కాలువలు మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా మారాయి. చుక్క సాగు నీరు పొలాలకు చేరే పరిస్థితి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని కాలువలు ధ్వంసం కాగా, ఇంకొన్ని గండ్లు పడ్డాయి. పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగి శిథిలమయ్యాయని వాపోతున్నారు. ఈ సీజన్‌ తైబంది ప్రక్రియ పూర్తయ్యేలోగా ఆ శాఖ అధికారులు కాలువల మరమ్మతులు చేయించి, పొదలు, చెట్లు, చెత్తను తొలగించాలని కోరుతున్నారు. జిల్లాలో పలు ఆయకట్టు కాలువలపై ‘న్యూస్‌టుడే’  పరిశీలనాత్మక కథనం..

జిల్లాలో 100 ఎకరాల్లోపు 2,802, 100-500 ఎకరాల్లోపు 258, 500 ఎకరాలకు పైబడి 70 చెరువులు ఉన్నాయి. హల్దీ ప్రాజెక్టు, ఘనపురం ఆనకట్ట ఉన్నాయి. వీటి కింద యాసంగిలో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటుండగా కాలువలు దెబ్బతినడంతో చివరి పొలాలకు నీరు అందటం కష్టంగా మారింది. 15 ఏళ్ల క్రితం వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు. నిర్వహణ లేకపోవడంతో కాలక్రమేణా కాలువలు నామరూపాల్లేకుండా పోయాయి. దీంతో నీరు పారకం కష్టంగా ఉంది.

వడియారంలో..

హల్దీ ప్రాజెక్టూ అధ్వానమే..

మాసాయిపేట మండలం హల్దీ ప్రాజెక్టు ఆయకట్టులో మొత్తం 2,900 ఎకరాలు ఉంది. 24 కి.మీ ఉన్న కుడి కాలువ కింద 2000 ఎకరాలు, 14 కి.మీ ఉన్న ఎడమ కాలువ కింద 900 ఎకరాలు ఉంది. కాగా రెండు కాలువలకు 7 కిలోమీటర్ల చొప్పున మాత్రమే గైడ్‌వాల్‌ నిర్మించారు. దీంతో ప్రాజెక్టు కింద కేవలం 400 ఎకరాలకు మించి సాగునీరు అందించలేని పరిస్థితి ఉంది. చాలాచోట్ల కాలువలు నామరూపాలు లేకుండా భూమట్టం అయ్యాయి. చెట్లు, పొదలు పెరిగాయి.

అన్నింటా అదే తీరు..

వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో మొత్తం 245 చెరువులు, కుంటలు ఉన్నా ఆయకట్టు కాలువలన్నీ శిథిలమయ్యాయి. ఉమ్మడి మండలంలో పెద్ద చెరువులైన వెల్దుర్తి దేవతల చెరువు, కుడి, మాసాయిపేట రామప్ప, మానేపల్లి పెద్ద చెరువు, ఊర, మన్నెవారిజలాల్‌పూర్‌ ఊర చెరువు, యశ్వంతరావుపేట, కుకునూర్‌ ఎల్లమ్మ చెరువుల కాలువలదీ అదే పరిస్థితి. మొత్తం 14 వేల ఎకరాల్లో వరి సాగుచేసేందుకు రైతులు సిద్ధం అయ్యారు. చేగుంట మండలంలో కాలువల్ని రైతులే బాగు చేసుకుంటున్నారు. నర్సాపూర్‌ మండలంలో 188 చెరువులు, కుంటలు ఉండగా వీటి కింద 16,874 ఎకరాల ఆయకట్టు ఉన్నా సాగునీరు పారే అవకాశం లేదు. పాపన్నపేట, హవేలిఘనపూర్‌, శివ్వంపేటలోనూ ఏ ఒక్క జలవనరు కాలువలు బాలేవు. చిలప్‌చెడ్‌, టేక్మాల్‌ మండలాల్లోనూ పొలాలకు నీరందే అవకాశం లేదు.

హవేలిఘనపూర్‌ చెరువు నుంచి వృథాగా పోతున్న నీరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని