logo

వేదనాదం.. విజ్ఞాన ప్రబోధం

వేదం.. లోకానికి జ్ఞానాన్ని సమకూర్చింది. మానవ మనుగడను, జీవిత పరామర్థాన్ని సూచిస్తుంది. అలాంటి వేదం చదివే వారు తగ్గిపోయారు.

Published : 07 Dec 2022 01:45 IST

న్యూస్‌టుడే, రామాయంపేట

వేదం.. లోకానికి జ్ఞానాన్ని సమకూర్చింది. మానవ మనుగడను, జీవిత పరామర్థాన్ని సూచిస్తుంది. అలాంటి వేదం చదివే వారు తగ్గిపోయారు. ప్రస్తుతం దీన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పం, భావితరాలకు అందించాలన్న లక్ష్యంతో రామాయంపేటకు చెందిన పడకంటి సంగమేశ్వర్‌ ముందడుగు వేశారు. ఇందుకు రామాయంపేటలో సాందీపని పేరిట పాఠశాలను నెలకొల్పారు.

2017లో..

వేద విద్యతో సకలం అందుతుందని సంగమేశ్వర్‌.. కంకణాల కిషన్‌, ముత్యాలు పలువురి దాతల సహకారంతో 2017 ఏప్రిల్‌లో వేదగురుకుల పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం నిజామాబాద్‌, మోర్తాడ్‌, మహారాష్ట్రతో పాటు బిహార్‌ తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.

యాగంలో

నిత్యం యోగాసనాలు..

పూర్వకాలంలో బ్రహ్మచర్యం పాటిస్తూ విద్యార్థులు ఎలాగైతే వేద విద్యను అభ్యసించేవారో.. ఇదే విధానాన్ని ఇక్కడ పాటిస్తుండటం గమనార్హం. తెల్లవారు జాము 4 గంటలకు విద్యార్థుల దినచర్య మొదలవుతుంది. యోగాసనాలు, సూర్యనమస్కారాలు చేస్తారు. ప్రకృతి సంరక్షణకు నిత్యం ఉదయం ఆచార్యులు వేదకరాచారా ఆధ్వర్యంలో బ్రహ్మయజ్ఞం నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న 16 మందిని రెండు విభాగాలుగా విభజించి బోధన కొనసాగిస్తున్నారు. యాగం చేసేందుకు దాతల సహకారంతో యాగశాలను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. నాలుగు వేదాలు, ఉపనిషత్తులు బోధిస్తున్నారు. వారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా తెలుగు, హిందీ, ఆంగ్లం నేర్పిస్తున్నారు. మరోవైపు సాంకేతిక విద్యను సైతం నేర్పిస్తున్నారు.

గో సంరక్షణ

ప్రకృతి వ్యవసాయంలో గోవు అత్యంత కీలకం. ఈ దిశగా రైతులను అడుగేయించాలన్న ఉద్దేశంతో పాఠశాలలో ప్రత్యేకంగా గిరిజాతి గోవుల పోషణ చేపట్టారు. పాఠశాలలో ఓ వైపు షెడ్డు నిర్మాణం చేపట్టి 28 ఆవులను పోషిస్తున్నారు. వాటి పాలు, గోపంచకం స్థానిక రైతులకు ఉచితంగా అందజేస్తున్నారు. గిరిజాతి ఆవులను కాపాడటంతో పాటు వాటి వల్ల కలిగే మేలు వివరిస్తున్నారు.

నిర్వహణ భారం..

సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో జాతీయ రహదారి పక్కనే రామాయంపేట సమీపంలో ప్రశాంత వాతావరణంలో ఎకరా స్థలంలో వేద పాఠశాల నిర్వహిస్తున్నారు. నిధులు లేక నిర్వహణ భారంగా మారింది. ప్రతి నెలా రూ.లక్ష వరకు వెచ్చించాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. దాతలు స్పందిస్తే మరో 30 మందికి బోధించేందుకు అవకాశం ఉందంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని