logo

నిబంధనల ఉల్లంఘన.. చిన్నారులకు వేదన!

గత అక్టోబరు 26న కంది మండలం ఇంద్రకరణ్‌లో సంగారెడ్డికి చెందిన ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తం కావడంతో చిన్నారులు క్షేమంగా బయట పడ్డారు.  

Published : 07 Dec 2022 01:45 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

వట్‌పల్లి మండలం బిజిలీపూర్‌ వద్ద..

* గత అక్టోబరు 26న కంది మండలం ఇంద్రకరణ్‌లో సంగారెడ్డికి చెందిన ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తం కావడంతో చిన్నారులు క్షేమంగా బయట పడ్డారు.  
* ఈనెల 5న వట్‌పల్లి మండలం బిజీలిపూర్‌ శివారులో జోగిపేటకు చెందిన ఓ ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన బడి బస్సు  అదుపు తప్పి బోల్తా పడింది. ఆరుగురికి తీవ్ర, 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సుకు అనుమతిలేదు.

విద్యా సంస్థలకు చెందిన బడి బస్సులు తప్పనిసరిగా సామర్థ్య పరీక్షలు చేయించి, ఆర్‌టీఏ నుంచి అనుమతి తీసుకోవాలి. ఏటా మే16 నుంచి జూన్‌ 15 వరకు పరిశీలిస్తారు. ఈ విధానాన్ని కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 840 ప్రైవేట్‌ విద్యా సంస్థలున్నాయి. వీటిల్లో 35 వరకు వాహన సామర్థ్య పరీక్షలు చేయించకుండానే తిప్పుతున్నారు. అయితే యాజమాన్యాలు, ఆర్‌టీఏ అధికారుల మధ్య సమన్వయ లోపం.. పిల్లలకు ప్రాణసంకటంగా మారుతోంది. ప్రమాదం జరిగితే తప్ప చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలున్నాయి. 

పన్ను మినహాయించినా..

విద్యాసంస్థలకు రవాణా పన్ను రూ.2వేల నుంచి 3వేల వరకు మినహాయింపు ఇస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు తమ బస్సులను అద్దెకు ఇస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇదే విషయమై రెండు నెలల్లో అయిదు బస్సులకు రూ.లక్ష చొప్పున జరిమానా విధించామని సంబంధిత శాఖ వర్గాలు తెలిపాయి. అనుమతి లేకుండా తిరుగుతున్న బస్సులపై గత జనవరి నుంచి డిసెంబరు 5వరకు 60 కేసులు నమోదు చేశారు. రూ.15 లక్షల జరిమానా విధించారు.

కంది మండలం ఇంద్రకరణ్‌లో..

హెచ్చరిస్తున్నా పాటించడంలేదు: శివలింగయ్య, జిల్లా ఉప రవాణా కమిషనర్‌

జిల్లాలో ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాల తప్పిందం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనుమతుల విషయంలో హెచ్చరిస్తున్నా పాటించడంలేదు. వట్‌పల్లి మండలం మర్వేల్లి, బీజిలిపూర్‌లో నడిపించిన జోగిపేటకు చెందిన ఓ ప్రైవేట్‌ స్కూల్స్‌ బసుకు వాహన సామర్థ్య పరీక్షలు చేయించలేదు. అనుమతులు లేవు. సంబంధిత నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని విద్యాశాఖకు సిఫార్సు చేస్తాం. డ్రైవర్‌కు లైసెన్సును రద్దు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని