logo

వినతులే.. వినేవారేరీ?

నిరుపేదలు సాగు చేసుకునేందుకు గతంలో ప్రభుత్వాలు భూములను కేటాయించాయి. అర్హులైన వారిని గుర్తించి పంపిణీ చేశారు.

Published : 07 Dec 2022 01:45 IST

పాసుపుస్తకాలందక గ్రామాల్లో లబ్ధిదారుల ఆందోళన

పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరుతున్న సింగీతం గ్రామ రైతులు

ఈనాడు, సంగారెడ్డి: నిరుపేదలు సాగు చేసుకునేందుకు గతంలో ప్రభుత్వాలు భూములను కేటాయించాయి. అర్హులైన వారిని గుర్తించి పంపిణీ చేశారు. విడతల వారీగా సాగిన ఈ కార్యక్రమాల్లో వేల మంది హక్కుదారులయ్యారు. భూ దస్త్రాల ప్రక్షాళన తర్వాత వీరికి అవస్థలు మొదలయ్యాయి. కొత్త పాసుపుస్తకాలు అందలేదు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రధాన సమస్యలను వెలుగులోకి తెచ్చేలా ‘ఈనాడు’ అందిస్తున్న కథనమిది.

వివాదం సమసేదెన్నడు!

కల్హేర్‌ మండలం నాగధర్‌లో సర్వేసంఖ్య 590లో 474.19 ఎకరాల భూమిని ఏళ్ల క్రితమే నిరుపేదలకు కేటాయించడంతో వారు సాగు చేసుకుంటున్నారు. కొత్త పాసుపుస్తకాలు ఇచ్చే సమయంలో అటవీ అధికారులు అభ్యంతరం తెలపడంతో పాసుపుస్తకాల పంపిణీ నిలిచిపోయింది. లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే గ్రామంలోని సర్వే సంఖ్య 665లో 168 ఎకరాల భూమి ఉంది. గతంలో ఈ మొత్తం విస్తీర్ణంలో పట్టాధ్రువీకరణ పత్రాలిచ్చారు. ఇప్పుడేమో అటవీ భూములంటున్నారు.

అసైన్డు పట్టాగా మార్చి..

జిన్నారం మండలం కిష్టాయపల్లి సర్వే సంఖ్య 166లో చాలా ఏళ్లుగా వివాదం నెలకొంది. ఇక్కడ దాదాపు 70 ఎకరాల వరకు అసైన్డు భూమిని పట్టాభూమిగా మార్చేశారు. ఇదే సర్వేసంఖ్యలో దాదాపు 50 మంది రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

తరచూ ధర్నాలు..

కొండాపూర్‌ మండలం మునిదేవునిపల్లి సర్వేసంఖ్యలు 92,54లలో 110 మందికి లావుణీ పట్టాలిచ్చారు. మాందాపురంలో 100 మందికి పైగా రైతులకు పట్టా పత్రాలు అందించారు. కుతుబ్‌షాహీపేటలోనూ 35 మంది రైతులుంటారు. వీరి పేర్లు పట్టాదారులుగా ధరణిలో చేర్చడం లేదు. కొత్త పాసుపుస్తకాలు ఇవ్వడం లేదు. ధర్నా, నిరసనల రూపాల్లో అధికారుల దృష్టికి తీసుకొస్తున్నా పరిష్కారం దొరకడం లేదంటున్నారు.

గొట్టిగార్‌పల్లిలోనూ..

కోహిర్‌ మండలం గొట్టిగార్‌పల్లిలోనూ అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాలున్నాయి. ఇక్కడా అసైన్డుదారులకు పాసుపస్తకాలు ఇవ్వలేదు. 120 మంది రైతులు అర్జీలు సమర్పిస్తూనే ఉన్నారు. ఇక్కడే పరంపోగు భూమిని దాదాపు 100 మందికి పైగా రైతులు ఏళ్లుగా సాగు చేస్తూ, పాసుపుస్తకాలివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆరు సర్వేసంఖ్యల్లోనూ...

రాయికోడ్‌ మండలం సింగీతంలో ఆరు సర్వే సంఖ్యల్లో అసైన్డు భూములున్నాయి. ఈ గ్రామంలోని చాలా మందికి వీటిలో పట్టాలిచ్చారు. కొత్త పాసుపుస్తకాలివ్వాలని తహసీల్దారు కార్యాలయం మొదలు కలెక్టరేట్‌ వరకు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు సమస్యకు పరిష్కారం లభించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని