logo

బాధిత కుటుంబానికి రూ.50 లక్షలివ్వాలి..

రెండు పడక గదుల ఇల్లు రాలేదని ఆత్మహత్య చేసుకున్న శీలసాగర్‌ రమేశ్‌ది.. ప్రభుత్వ హత్యేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు ఆరోపించారు.

Published : 07 Dec 2022 01:45 IST

రమేశ్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న కాంగ్రెస్‌, భాజపా నేతల డిమాండ్‌ 

పాడె మోస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు, నర్సారెడ్డి

గజ్వేల్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: రెండు పడక గదుల ఇల్లు రాలేదని ఆత్మహత్య చేసుకున్న శీలసాగర్‌ రమేశ్‌ది.. ప్రభుత్వ హత్యేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం అహ్మదీపూర్‌లో జరిగిన రమేశ్‌ అంత్యక్రియల్లో ఆయన పాల్గొని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాడె మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులకు ఇల్లు అందడం లేదనడానికి రమేశ్‌ మృతి నిదర్శనమన్నారు. పేదల ఇళ్ల పంపిణీ తెరాస నాయకులకు ఓ వ్యాపారంలా మారిందని డబ్బు వసూలు చేస్తున్నారని విమర్శించారు. విషయాన్ని జిల్లా మంత్రి హరీశ్‌రావు గమనించాలన్నారు. తన నియోజకవర్గానికి చెందిన పౌరుడు మృతి చెందితే కుటుంబ సభ్యుల పరామర్శకు సీఎంకు సమయం దొరకడం లేదని విమర్శించారు. రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆత్మహత్యకు కారకులైన వారిపై హత్య కేసు నమోదు చేయాలన్నారు. తాను ఇక్కడికి రాజకీయ లబ్ధికి రాలేదని, మానవతా దృక్పథంతోనే వచ్చానని పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, నాయకులున్నారు.

ఆత్మహత్యలపై విచారించాలి: ప్రభుత్వ వైఫల్యాలే ఆత్మహత్యకు కారణాలవుతున్నాయని మూడేళ్లలో జరిగిన వాటిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. అహ్మదీపూర్‌లో రమేశ్‌ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలన్నిటికీ రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని అందించాలన్నారు. తెరాస నాయకుల జోక్యం లేకుండా పేదలకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదని ఆరోపించారు. సిద్దిపేటలో రమేశ్‌, నిజామాబాద్‌లో ఆంజనేయులు ఇలాగే  ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. సంక్షేమ పథకాలేవీ కేసీఆర్‌ సొంత ఆస్తి కాదన్నారు. ఇతర రాష్ట్రాల్లో చనిపోయిన వారికి డబ్బు ఇస్తున్న కేసీఆర్‌ మన వద్ద ఇచ్చేందుకు చేతులు రావడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ రమేశ్‌ మృతదేహానికి అర్ధరాత్రి పోస్టుమార్టం చేసి రాత్రికిరాత్రి స్వగ్రామానికి ఎందుకు తరలించారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నలగామ శ్రీనివాస్‌, మనోహర్‌యాదవ్‌ ఉన్నారు.

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌రావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని