logo

కేసీఆర్‌ కృషితో దుబ్బాక అభివృద్ధి: మంత్రి

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దుబ్బాకపై ప్రత్యేక ప్రేమ ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 31 Dec 2022 02:03 IST

బస్సు సర్వీసు ప్రారంభిస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్‌, మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌, ఎంపీ, ఎమ్మెల్యే

చేగుంట, దుబ్బాక, మిరుదొడ్డి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దుబ్బాకపై ప్రత్యేక ప్రేమ ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌, నిరంజన్‌రెడ్డిలు దుబ్బాక, మండల పరిధిలోని పోతారం, హబ్షీపూర్‌, రాజక్కపేటలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. దుబ్బాక నుంచి తిరుపతి, హన్మకొండలకు బస్సు సర్వీస్‌లను ఆర్టీసీ ఛైర్మన్‌ గోవర్ధన్‌తో కలిసి మంత్రులు ప్రారంభించారు. అనంతరం మార్కెట్‌ కమిటీ ఆవరణలో నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో హరీశ్‌ రావు మాట్లాడారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో వసతుల కల్పనతో పాటు అంగన్‌వాడీ కేంద్రం, రేషన్‌ దుకాణం, బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తామన్నారు. 15 రోజుల్లో ఇక్కడి ఆసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం జలాశయంతో కూడవెల్లి వాగు జీవధారగా మారిందన్నారు. ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ దుబ్బాక డిపోకు మరిన్ని కొత్త బస్సుల మంజూరుకు సిద్ధమన్నారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ చొరవతో ఇటీవల మంజూరైన రూ.20 కోట్లతో అంతర్గత దారులు, మురుగు కాలవల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎమ్మెల్సీలు ఫారుఖ్‌హుస్సేన్‌, బండ ప్రకాశ్‌, యాదవరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ రోజాశర్మ, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ సాయిచంద్‌, పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ సభ్యుడు రవీందర్‌రెడ్డి, పుర ఛైర్‌పర్సన్‌ వనిత, ఏఎంసీ ఛైర్‌ పర్సన్‌ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


ప్రారంభోత్సవంలో రసాభాస

హబ్షీపూర్‌ శివారులో గోదాం ప్రారంభానికి మంత్రులు రావడంతో భాజపా కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేశారు. దీంతో భారాస కార్యకర్తలు పోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేస్తూనే హడావుడిగా గోదాంను ప్రారంభించారు. మంత్రుల కంటే ముందే ఎమ్మెల్యే రఘునందన్‌రావు దుబ్బాకలో కొత్త బస్టాండ్‌కు చేరుకున్నారు. మంత్రులు ద్విచక్ర వాహన ర్యాలీతో బస్టాండ్‌ ప్రాంతానికి చేరుకోగానే మరోసారి ఇరుపార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. కార్యకర్తల తోపులాట మధ్యే మూడు బస్సులను ప్రారంభించారు. మంత్రి హరీశ్‌రావు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. సీపీ శ్వేత కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు.


పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని