logo

ఉపాధ్యాయుల సృజనకు మరో మెట్టు

టీఎల్‌ఎం (బోధనాభ్యసన సామగ్రి) జిల్లాస్థాయి మేళా ఉపాధ్యాయుల్లో జోష్‌ను నింపింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే పలువురు.

Updated : 21 Jan 2023 06:29 IST

బోధనాభ్యసన సామగ్రి రూపకల్పనలో వైవిధ్యం

నమూనాలను తిలకిస్తూ..

న్యూస్‌టుడే, సిద్దిపేట, సిద్దిపేట టౌన్‌: టీఎల్‌ఎం (బోధనాభ్యసన సామగ్రి) జిల్లాస్థాయి మేళా ఉపాధ్యాయుల్లో జోష్‌ను నింపింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే పలువురు.. సృజనాత్మకతకు చాటేలా నమూనాలు తీర్చిదిద్ది ఔరా అనిపించారు. కృత్యాధారంగా విద్యార్థులకు సులువైన బోధనే లక్ష్యంగా ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట ఇందిరానగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల వేదికగా నిర్వహించిన మేళాను జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఐఏఎస్‌ శిక్షణార్థి ఫైజాన్‌ అహ్మద్‌తో కలిసి ప్రారంభించారు. ఉపాధ్యాయులు మొత్తం 296 నమూనాలు ప్రదర్శించారు. దిల్లీ నుంచి సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు దీపక్‌, ఈశ్వర్‌, శాలెట్‌, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.అయోధ్యరెడ్డి సందర్శించారు. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అదనపు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ హాజరై మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన ఉపాధ్యాయులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. సమగ్ర శిక్ష అకాడమిక్‌ పర్యవేక్షక అధికారి బేతి భాస్కర్‌ పర్యవేక్షించారు. పది నమూనాలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు.


చూడండి.. చెప్పండి..

కోహెడ మండలం వింజపల్లి మదిర గ్రామమైన పెరుకలగడ్డ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రవివర్మ పది నమూనాలు ప్రదర్శించారు. ‘నాలోని అక్షరాన్ని చూసి పదాన్ని చెప్పండి’ అంటూ.. చొక్కాకు అక్షరాలను అతికించారు. నిత్యం పాఠశాలలో ఈ చొక్కా ధరించి బోధన కొనసాగిస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా దృశ్య, శ్రవణ సహితంగా పాఠాలు వినే సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. ఈ పాఠశాలలో 45 మంది విద్యార్థులకు ఆయన ఏకోపాధ్యాయుడు.


అనుభూతి కలిగేలా..

రాయపోల్‌ మండలం కొత్తపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు నాగరాజు. శరీరంలోని అంతర్గత అవయవాల సంబంధిత నమూనాను ప్రదర్శించారు. పరిసరాల విజ్ఞాన విభాగంలో ఇది ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థులకు అనుభూతి కలిగేలా తెల్లని వస్త్రం, పత్తితో శరీర అవయవాలను రూపొందించారు. ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, కిడ్నీలు, అస్థిపంజరం, మెదడు, ఇతరత్రా నమూనాలను ప్రదర్శించారు.


ఆంగ్ల భాష.. సులువు..

సిద్దిపేట అర్బన్‌ మండలం నాంచారుపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు ఎస్‌.స్రవంతి.. ఆంగ్లంలో మొదటి స్థానంలో నిలిచారు. ‘సెంటెన్స్‌ ఫార్మేషన్స్‌ బై యూసింగ్‌ వర్డ్స్‌ పాండ్‌’ నమూనాను రూపొందించారు. వాక్యాలు, పదాల నిర్మాణం నేర్చుకునేందుకు ఇది దోహదం చేయనుంది. మొదటి దశలో ఆంగ్ల అక్షరాలు, రెండో దశలో పదాల కొలను, మూడో దశలో వాక్య నిర్మాణం నేర్పిస్తారు. నాలుగో దశలో సొంతంగా వాక్య నిర్మాణం చేసేలా ప్రోత్సహిస్తారు. చేపల ఆకృతిలో పదాలు రూపొందించారు.


రెండు నెలలుగా..

మిరుదొడ్డి మండలం కాసులాబాద్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి.. భాషాభాగాలు, అక్షరమాల, వ్యాకరణ అంశాలను పర్యావరణ హితమైన 200 చెరుకు పిప్పితో తయారు చేసిన ప్లేట్లపై ప్రదర్శించారు. వీటికి రెండు నెలల సమయం పట్టిందని చెప్పారు.


అనువుగా గణితం

తొగుట మండలం చందాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్ధేశ్వర్‌.. గణిత సబ్జెక్టులో ముందంజలో నిలిచారు. ‘మ్యాజిక్‌ బోర్డు’ నమూనాను రూపొందించి ప్రదర్శించారు. కూడికలు, తీసివేతలు, గుణాకారాలు, భాగహారాలు, శాతాలు, క.సా.గు, గ.సా.భా., ఇతరత్రా అంశాలు సులువుగా నేర్చుకునేందుకు అనువుగా రూపొందించారు.


చక్రం తిప్పు.. పదం చెప్పు..

అక్కన్నపేట మండలం గౌరవెల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు అనందాసు సునిత.. తెలుగు విభాగంలో జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ‘చక్రం తిప్పు - పదం చెప్పు’ నమూనా రూపొందించారు. కదిలే చక్రాన్ని అట్టలు, వాడిపడేసిన జువెలరీ, ఇతరత్రా బాక్సులతో తయారీ చేశారు. తెలుగు భాషా సామర్థ్యాలను సులువుగా సాధిస్తారని వివరించారు. సరళ పదాలు, దీర్ఘాలు, గుణింతాలు, గుణింతాక్షర పదాలు, ద్విత్వాక్షరాలు, పదాలు నేర్పించే విధానం స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని