logo

రెండు పడక గదుల ఇళ్లు అద్భుతం

పేదల కోసం తెల్లాపూర్‌ పురపాలక పరిధి కొల్లూరు గ్రామంలో కేంద్ర, రాష్ట్ర నిధులతో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయాలను పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ శనివారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది

Published : 22 Jan 2023 04:06 IST

పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ కితాబు

బృందం సభ్యులకు వివరిస్తున్న పాలనాధికారి శరత్‌

రామచంద్రాపురం రూరల్‌: పేదల కోసం తెల్లాపూర్‌ పురపాలక పరిధి కొల్లూరు గ్రామంలో కేంద్ర, రాష్ట్ర నిధులతో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయాలను పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ శనివారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా రాజీవ్‌ రంజన్‌సింగ్‌ నేతృత్వం వహించారు. ఈ సభ్యులకు జిల్లా కలెక్టర్‌ శరత్‌ స్వాగతం పలికారు. అనంతరం ప్రాంగణం వివరాలను పురపాలన డైరెక్టర్‌ సత్యనారాయణ, గృహనిర్మాణ శాఖ ఓఎస్‌డీ సురేష్‌లు సభ్యులకు వివరించారు. 1,480 కోట్లతో 124 ఎకరాల్లో 15,661 ఇళ్లు 117 బ్లాకులుగా విభజన చేసి 20 శాతం స్థలంలో నిర్మాణాలు చేపట్టామని వివరించారు. 80శాతం భూమిని మౌలిక సదుపాయాల కల్పనకు వదిలిపెట్టామని, తాగునీటికి రిజర్వాయర్‌, విద్యుత్తు సబ్‌స్టేషన్‌, పాఠశాల, ఆలయాలు, పోలీస్‌స్టేషన్‌ అన్ని రకాలుగా పూర్తి సౌకర్యాలు ఇందులోనే కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. నమూనా కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను చూపించారు. నిధుల సమీకరణలో ఎలా జరిగిందన్న ప్రశ్నకు ఒక్కో ఇంటికి కేంద్ర వాటా రూ.1.5 లక్షలు కాగా, రాష్ట్ర వాటా రూ.8.5 లక్షలు భరించిందని అధికారులు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో లక్ష రెండు పడక గదుల ఇళ్లు ఇదే తరహాలో నిర్మాణాలు జరిగాయని వివరించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. పేదలకు పూర్తి స్థాయి సౌకర్యాలతో కూడిన ఇళ్లు అద్భుతంగా ఉన్నాయని, ఉన్నత వర్గాలతో సమానంగా నివాస సదుపాయాలు ఉన్నాయంటూ సభ్యులు పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు సంజయ్‌సింగ్‌, ఆరిఫ్‌, శ్రీరంగబార్‌, బెన్ని బెహనాన్‌, రామ్‌చరణ్‌, గౌతమ్‌ గంభీర్‌, జలీల్‌, శంకర్‌లల్వాని, హేమమాలిని, మసూది, మోహన్‌, పాటిల్‌, అపరాజిత సరాగి, సునీల్‌కుమార్‌ ఠాగూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని