logo

పకడ్బందీగా.. పచ్చందాల పెంపు

పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపడుతోంది. ఏడేళ్ల నుంచి పల్లె, పట్నం తేడా లేకుండా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటడంతో, ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

Published : 23 Jan 2023 01:29 IST

ఎనిమిదో విడతకు సన్నద్ధత
న్యూస్‌టుడే,మెదక్‌

మనోహరాబాద్‌ మండలం లింగారెడ్డిపేటలో నర్సరీ

ర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపడుతోంది. ఏడేళ్ల నుంచి పల్లె, పట్నం తేడా లేకుండా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటడంతో, ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఏటా నర్సరీల్లో వివిధ రకాల వాటిని పెంచుతూ.. వానాకాలంలో వాటిని నాటేలా అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో ఎనిమిదో విడతకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రతి నర్సరీలో పలు రకాలవి పెంచేలా కార్యాచరణ చేపట్టారు. గతేడాది ఉన్న వాటిని పెద్దసంచుల్లోకి మారుస్తుండగా, కొత్తవి పెంచేందుకు సంచుల్లో విత్తనాలు వేసి మట్టి నింపుతున్నారు.

జిల్లాలో 469 పంచాయతీల్లో ఏడో విడతతో లక్ష్యానికి మించి నాటడం గమనార్హం. గ్రామాలు, పట్టణాల్లో పెద్దసంఖ్యలో మొక్కలు నాటారు. మండల కేంద్రాలతో పాటు ఆయా ప్రాంతాలకు వెళ్లే రహదారులకు ఇరువైపులా నాటడంతో, అవి నేడు వృక్షాలుగా మారాయి. అటవీప్రాంతాల్లోను ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కాలుష్యనివారణ, పర్యావరణ పరిరక్షణపై  ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఎనిమిదో విడతలో అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో 35.92 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఆ మేరకు పంచాయతీలు, పురపాలికల్లోని నర్సరీల్లో పెంపకం పనులు ప్రారంభమయ్యాయి ఆయా నర్సరీల్లో 53.23 లక్షలు కొత్తగా పెంచనున్నారు. గతేడాది 13.96 లక్షల మిగిలాయి. వాటిని కూడా ఈ సారి వినియోగించనున్నారు. సంచుల్లో మట్టి నింపి, రకరకా మొక్కల విత్తనాలు వేసి పెంచుతున్నారు. ఆయా మండలాల అధికారులు యాదాద్రి, సిద్దిపేట, అనంతపురం, బెంగళూర్‌ ప్రాంతాల నుంచి కొనుగోలు చేశారు. గతేడాది 115.57 శాతం మేర మొక్కలను నాటారు. 8.39 లక్షలను ఇంటింటికీ పంపిణీ చేసి, వాటిని నాటేలా చర్యలు తీసుకున్నారు.


పౌష్టికాహారం అందించేందుకు..

విద్యార్థులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్న సంకల్పంతో సర్కారు ముందుకు సాగుతోంది. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలో పెరటి తోటలను పెంచుతున్నారు. ఈసారి మునగకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మండలానికి రెండు చోట్ల స్వయం సహాయక సంఘాల మహిళల పంపిణీ చేయనున్నారు. వీటిని జిల్లాలో ఉన్న ప్రభుత్వ వసతిగృహాలు, పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా, ఆదర్శ, అంగన్‌వాడీ కేంద్రాల్లో నాటేలా ప్రణాళిక రూపొందించారు. మునగకాయలు చేతికి అందాక ఆహారానికి వినియోగించనున్నారు. ఇవే కాకుండా ఇళ్లలో పెంచేవి, పూలవి, వెదురువి నాటేలా దృష్టి సారిస్తున్నారు.


వన సేవకులకు శిక్షణ ఇస్తున్నాం

శ్రీనివాస్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

నర్సరీల్లో మొక్కల పెంపకం పకడ్బందీగా చేపడుతాం. ఉపాధి హామీ సిబ్బందికి అవగాహన కల్పించాం. ప్రస్తుతం మండల స్థాయిలో వనసేవకులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రతి మండలంలో ఈసారి నుంచి రెండు నర్సరీలను స్వయం సహాయక సంఘాల మహిళలకు కేటాయించాం. పరిరక్షణకు షేడ్‌ నెట్‌ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని