logo

ఎదగక.. ఎండుముఖం!

ఎంతో ఆశతో వరి నాట్లు వేశారు. పంట ఆశాజనకంగా ఉంటుందని భావించారు. తనకు భూమి లేకున్నా కౌలుకు తీసుకొని మరీ సాగు చేపట్టారు. నాట్లు వేసి నెలరోజులైనా ఎదగక పోగా మొత్తం ఎండుముఖం పట్టింది.

Updated : 23 Jan 2023 05:22 IST

న్యూస్‌టుడే, చేగుంట

25 రోజుల క్రితం నాటు వేసిన వరిపంట

ఎంతో ఆశతో వరి నాట్లు వేశారు. పంట ఆశాజనకంగా ఉంటుందని భావించారు. తనకు భూమి లేకున్నా కౌలుకు తీసుకొని మరీ సాగు చేపట్టారు. నాట్లు వేసి నెలరోజులైనా ఎదగక పోగా మొత్తం ఎండుముఖం పట్టింది. ఇది చేగుంట మండలం చిన్నశివునూర్‌ శివారులో వరి వేసిన రైతు పెంట్యా పరిస్థితి. 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆరెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. మూడేళ్లుగా ఏడాదికి రూ.లక్ష చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో 25 రోజుల క్రితం వరి నాట్లు వేశారు. మొదట్లో బాగానే ఉన్నా రోజురోజుకు ఎండిపోతూ వచ్చింది. మందులు చల్లినా ప్రయోజనం శూన్యం. రూ.లక్ష వరకు ఖర్చు చేసినా వృథా ప్రయాసే అయింది. పంట ఎందుకు ఎండిపోతుందో తెలియక ఆవేదనకు గురవుతున్నారు. మూడు బోర్ల నుంచి సమృద్ధిగా నీళ్లు వస్తుండటంతో వరి వైపు దృష్టిసారించారు. మళ్లీ నాట్లేయాలంటే రూ.75 వేలు ఖర్చు చేయాల్సిందేనని వాపోతున్నారు. మరోవైపు నారు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రైతు మధుసూదన్‌రెడ్డి పరిస్థితి ఇలాగే ఉంది. ఐదెకరాల్లో సాగు చేపట్టారు. అయితే సమీపంలో ఉన్న ఓ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ జలాలతో పంట ఎండిపోతున్నట్లు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చేగుంట ఏవో హరిప్రసాద్‌ని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా పొలాలకు వెళ్లి పరిశీలిస్తామని తెలిపారు.

తిరిగి నాట్లు వేసేందుకు దున్నుతున్న రైతు

ప్రభుత్వం ఆదుకోవాలి: పెంట్యా

వరి పంట ఎండిపోతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియటంలేదు. రూ. లక్షలు పెట్టుబడులు పెట్టాం. తిరిగి నాట్లు వేసినా, అదే పరిస్థితి పునరావృతం అయితే మళ్లీ నష్టం తప్పదేమో. వ్యవసాయాధికారులు పంటలను పరిశీలించి ఆదుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని