logo

జాతర ఘనం.. సౌకర్యాలు అధమం!

మల్లన్న సన్నిధికి వచ్చిన భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మార్పు చూపిస్తామని, సౌకర్యాలు కల్పిస్తామన్న ఆలయ అధికారులు, పాలకవర్గం మాటలు నీటి మూటలయ్యాయి.

Published : 25 Jan 2023 01:38 IST

మల్లన్న సన్నిధిలో భక్తుల వెతలు
న్యూస్‌టుడే, చేర్యాల

కొమురవెల్లి నుంచి రాజీవ్‌ రహదారి వైపు ఇలా..

మల్లన్న సన్నిధికి వచ్చిన భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మార్పు చూపిస్తామని, సౌకర్యాలు కల్పిస్తామన్న ఆలయ అధికారులు, పాలకవర్గం మాటలు నీటి మూటలయ్యాయి. ఏటా రూ.18 కోట్లకుపైగా ఆదాయం సమకూరే ఆలయం చెంతన మౌలిక వసతులు కరవయ్యాయి. వచ్చే ఉగాది వరకు జాతర కొనసాగనుండగా.. రాష్ట్రంలోని నలు మూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. ఈ మూడు నెలల్లోనే పాతిక లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ స్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం విఫలమైంది. ప్రధాన రహదారుల నిర్మాణం, నీటి సరఫరా, మురుగు పారుదల వ్యవస్థ, ధర్మగుండం నిర్వహణ తదితర సమస్యల విషయంలో తలెత్తిన లోపాల్ని అధికార గణం సరిద్దిలేకపోయింది. కొమురవెల్లి-రాజీవ్‌ రహదారి మధ్యనున్న 3 కిలోమీటర్ల రహదారి అధ్వానంగా మారింది. ఇరుకైన దారికి ఇరువైపులా, రోడ్డుపై గుంతల్లో ఇటీవల మట్టి పోశారు. ఆ మట్టి దుమ్ముతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

మురుగు తీరు..

మెరుగవని పారిశుద్ధ్య నిర్వహణ

మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతో రహదారులు బురదమయంగా మారుతున్నాయి. స్థానిక పోలీసు స్టేషన్‌ ఎదురుగా భూగర్భ కాలువ మ్యాన్‌హోల్‌ నుంచి మురుగు బయటకు వస్తోంది. ఆలయం ముందున్న ప్రధాన రహదారి, ఆలయ రాజగోపురం నుంచి కల్యాణ వేదిక వద్దకు వెళ్లే ప్రధాన దారిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. స్వామివారికి, రేణుకా ఎల్లమ్మతల్లికి నైవేద్యం సమర్పించేందుకు బోనాలతో వెళ్లే భక్తులు ఈ బురదలో నడవక లేక ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచాల్సిన అవసరం ఉంది.

స్నాన ఘట్టాల్లో కనిపించని నీటిధార

వ్యవసాయ బావులే దిక్కు

కొమురవెల్లికి వచ్చే భక్తులకు నీటి వసతి కల్పించడంలో ఆలయ వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఆలయ ప్రాంతంలో చాలా చోట్ల స్నానఘట్టాలు ఏర్పాటు చేసినప్పటికీ నీటి సరఫరా లేదు. దీంతో భక్తులు రోడ్డు వెంట ఉన్న వ్యవసాయ బావులను ఆశ్రయించక తప్పలేదు. ఇదే అదనుగా రైతులు నీటిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకున్నారు. ఆలయ పరిధిలో తాగునీటి కోసం నల్లాల కింద ఏర్పాటు చేసిన తొట్లలో  మురుగు నిలిచి కంపు కొడుతున్నాయి. దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. భక్తులు దుకాణాల్లో రూ.20లీటర్ల నీటి డబ్బాకు రూ.40 చొప్పున చెల్లించి వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని