logo

దుర్వాసన.. విద్యార్థినుల వేదన!

జిల్లాలో ఏకైక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల మెదక్‌ పట్టణంలో ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ తదితర ప్రాంతాల విద్యార్థినులు ఇక్కడ చదువుతున్నారు.

Published : 25 Jan 2023 01:38 IST

న్యూస్‌టుడే, మెదక్‌ టౌన్‌

కళాశాల చుట్టూ మురుగు

జిల్లాలో ఏకైక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల మెదక్‌ పట్టణంలో ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ తదితర ప్రాంతాల విద్యార్థినులు ఇక్కడ చదువుతున్నారు. వీరంతా సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రథమ, ద్వితీయ మొత్తం 676 మంది విద్యార్థినులున్నారు. ఎంపీసీ (తెలుగు, ఆంగ్లం), బీపీసీ (తెలుగు, ఉర్దూ, ఆంగ్లం), సీఈసీ, హెచ్‌ఈసీ (తెలుగు) మాధ్యమం కొనసాగుతున్నాయి. కళాశాల భవనం చుట్టూ చెరువు ఉంది. పట్టణంలోని వివిధ కాలనీల నుంచి వెలువడే మురుగంతా ఇందులోను కలుస్తోంది. దీంతో దుర్వాసన వ్యాపిస్తోందని, విద్యార్థినులు, అధ్యాపకులు వాపోతున్నారు. ఇక పందుల సంచారం, ఈగలు, దోమలు వ్యాప్తి చెంది విషజ్వరాలతో అవస్థలు పడుతున్నామని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గదుల కొరత..  భవనంలో విద్యార్థులకు సరిపడా గదులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రయోగశాల గదుల్లో, మొదటి అంతస్తులో అసంపూర్తిగా ఉన్న ప్రదేశంలో కొనసాగిస్తున్నారు. ప్రయోగ పరికరాలను తొలగించారు. నాలుగు ఏళ్ల కిందట జీ ప్లస్‌ వన్‌ భవన నిర్మాణానికి రూ.2.50 కోట్లు కేటాయించారు. టెండర్‌ ప్రకారం పూర్తిగా గదులు నిర్మించలేదు. కేవలం ప్రయోగ కేంద్రంతో కలిపి 10 మాత్రమే నిర్మించి, మొదటి అంతస్తులో సగభాగాన్ని వదిలిపెట్టారు.

గదుల కొరతతో బయట కొనసాగుతున్న తరగతులు


కాలువలు నిర్మిస్తే పరిష్కారం

-శివనాగరాజు, డీఈఈ నీటిపారుదల శాఖ మెదక్‌

కాలనీల నుంచి వెలువడే మురుగు చెరువులో కలవడంతో కలుషితమవుతోంది. పురపాలిక పరిధిలో ఉండటంతో, సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆయా ప్రాంతాల్లో కాలువలు నిర్మిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.

- మహాలక్ష్మిదేవి, ప్రిన్సిపల్‌, ప్రభుత్వ  బాలికల జూనియర్‌ కళాశాల మెదక్‌

కళాశాలలో తాగునీరు, అదనపు గదుల కొరత, కాలువ నిర్మాణం తదితర సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో అన్ని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.


ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు

- సత్యనారాయణ, జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి

కళాశాలలో సమస్యలు ఉన్నమాట నిజమే, చుట్టూ ప్రహరీ నిర్మాణానికి గతేడాది ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు కొరత ఉండడంతో ఇంకా అనుమతులు రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని