logo

‘మువ్వన్నెల’ వేడుక.. ప్రగతి నివేదిక

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి బాటలో పయనించేలా కృషి చేస్తున్నామని అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌ పేర్కొన్నారు.

Published : 27 Jan 2023 04:09 IST

న్యూస్‌టుడే, మెదక్‌: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి బాటలో పయనించేలా కృషి చేస్తున్నామని అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక సమీకృత కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వివిధ శాఖల ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..  

అన్నదాతలకు అండగా..

జిల్లాలో గత ఖరీఫ్‌లో 410 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 3.93 లక్షల టన్నుల ధాన్యం సేకరించి రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నిలిచాం. 91,379 మంది రైతులకు ధాన్యం డబ్బులు రూ.810.77 కోట్లను ఖాతాల్లో జమచేశాం.  రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో రబీ సీజన్‌లో 2.34 లక్షల మందికి రూ.173.31 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశాం. వివిధ కారణాలతో మృతి చెందిన 323 మంది అన్నదాతల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.16.15 కోట్లు చెల్లించాం.

పేదలకు సహకారం

కల్యాణలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 3,255 మంది లబ్ధిదారులకు, షాదీముబారక్‌ పథకం కింద 185 మంది లబ్ధిదారులకు కలిపి మొత్తం రూ.34.33 కోట్లు ఇచ్చాం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు 6,693 స్వయం సహాయక సంఘాలకు రూ.413.52 కోట్ల రుణం అందించాం. ఆసరా ద్వారా 1,18,560 మంది లబ్ధిదారులకు ప్రతినెలా పింఛన్‌ అందిస్తున్నామని, ఇందుకు రూ.25.63 కోట్ల వ్యయం చేస్తున్నాం. దళితబంధులో తొలి విడత అర్హులైన 256 మందికి రూ.25.34 కోట్ల సాయం అందించాం.

సంబురంగా..

గణతంత్ర వేడుకలు సంబురంగా జరిగాయి. అదనపు పాలనాధికారిణి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులను సత్కరించారు. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. జిల్లా స్త్రీ,శిశుసంక్షేమశాఖ, మెప్మా, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి సంక్షేమశాఖల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఆవరణలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న నలుగురు దంపతులకు రూ.2.50 లక్షల చొప్పున డిపాజిట్‌ బాండ్లను అందజేశారు. మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాలకు రూ.11.92 కోట్ల రుణాల చెక్కును అదనపు పాలనాధికారులు సంఘాల మహిళలకు పంపిణీ చేశారు. జాతీయస్థాయి క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు పాలనాధికారి రమేశ్‌, ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు ఎస్పీ డా.బాలస్వామి, జిల్లా అధికారులు శ్రీనివాస్‌, విజయశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌రావు, రమేశ్‌కుమార్‌, సాయిబాబ, జయరాజ్‌, జెమ్లానాయక్‌, కమలాకర్‌, రాజిరెడ్డి, కృష్ణమూర్తి, నాగరాజు, నర్సయ్య, సుధాకర్‌, కేశురాం, విజయలక్ష్మి, ఆశాకుమారి, రజని, ఇందిర, బ్రహ్మాజీ, ఆర్డీవో సాయి రాం, డీఎస్పీ సైదులు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, పురపాలిక అధ్యక్షులు చంద్రపాల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ చంద్రాగౌడ్‌ పాల్గొన్నారు.

24,172 మందికి కంటిపరీక్షలు

* రెండో విడత కంటివెలుగు కార్యక్రమంలో ఇప్పటి వరకు 24,172 మందికి కంటిపరీక్షలు చేయగా, వారిలో 4,319 మందికి కళ్లాద్దాలు అందజేశాం. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెంచడం, మాతా, శిశు మరణాల నివారణకు అమ్మఒడి, కేసీఆర్‌ కిట్‌ పథకాలు అమలు చేస్తున్నాం.

*  జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరిన్ని ఎకరాలకు సాగు నీరందించే ప్రక్రియ మొదలైంది. చిన్నశంకరంపేట కాలువ ద్వారా 19,452 ఎకరాలకు సాగునీరందించే పనులు పురోగతిలో ఉన్నాయి.

*  పురపాలికల్లో అధునాతన సమీకృత మార్కెట్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తూప్రాన్‌ పట్టణంలో రూ.30 కోట్లతో నిర్మాణం పూర్తయింది. మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట పట్టణాల్లో పనులు జరుగుతున్నాయి.

*  మన ఊరు-మన బడి ద్వారా తొలివిడతగా 313 పాఠశాలలను ఎంపిక చేశాం. ఇందులో 311 పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు రూ.65 కోట్లతో అంచనాలు రూపొందించి, 258 పాఠశాలల్లో పనులు చేపట్టాం. పలు చోట్ల పూర్తయ్యాయి.   1,078 అంగన్‌వాడీ కేంద్రాల్లో, 11 చోట్ల ఆదర్శ కేంద్రాలుగా తీర్చిదిద్దే పనులు ప్రారంభమయ్యాయి.

* జిల్లాలో ధరణి ద్వారా 68,057 లావాదేవీలు జరిగాయి. టీఎస్‌-ఐపాస్‌ విధానంలో ఇప్పటి వరకు 759 పరిశ్రమలకు రూ.8,093 కోట్ల పెట్టుబడితో 25,354 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని