logo

అక్షర శ్రీకారం.. భక్తజన శోభితం

జ్ఞాన సౌభాగ్యాన్ని పొందవచ్చనే భక్తి విశ్వాసంతో సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందిన వర్గల్‌ విద్యాసరస్వతి అమ్మవారిని గురువారం వసంత పంచమి సందర్భంగా వేలాది భక్తులు దర్శించి అర్చించారు.

Published : 27 Jan 2023 04:09 IST

విశేష అలంకరణలో..

వర్గల్‌, న్యూస్‌టుడే: జ్ఞాన సౌభాగ్యాన్ని పొందవచ్చనే భక్తి విశ్వాసంతో సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందిన వర్గల్‌ విద్యాసరస్వతి అమ్మవారిని గురువారం వసంత పంచమి సందర్భంగా వేలాది భక్తులు దర్శించి అర్చించారు. చిన్నారులకు అక్షర శ్రీకారం చేయించారు. వేకువజాము నుంచి వరుస కట్టి అమ్మను దర్శించుకున్నారు. గణతంత్ర దినోత్సవం, వసంత పంచమి కలసి రావడంతో అధిక సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. హైదరాబాద్‌ జంటనగరాలు, ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. సరస్వతి అమ్మవారికి తెల్లవారుజామున పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకరభారతి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్‌ యాయవరం చంద్రశేఖరశర్మ కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. అనంతరం పల్లకి సేవ కనువిందు చేసింది. చండీహోమం చేపట్టారు. చలువ పందిళ్లున్న క్యూలైన్ల నుంచి భక్తులను కొండ పైకి పంపారు. అన్నప్రసాద పంపిణీ జరిగింది. సాయంత్రం వరకు 60 వేల మంది దర్శించుకున్నారు. పది వేల మంది చిన్నారుల విద్యాభ్యసనం ప్రారంభమైంది. 56 (ఛప్పన్‌ భోగ్‌) రకాల మధుర పదార్థాలతో విద్యాధరిని అలంకరించారు. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి పాల్గొన్నారు. వేద విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందించారు. శ్రీక్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి అనుగ్రహభాషణం చేశారు. కలెక్టర్‌  ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తమ చిన్నారులిద్దరికి అక్షరాభ్యాసాలు చేయించారు. జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ దంపతులు, రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్‌ హనుమంతరావు, గడాధికారి ముత్యంరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రతాపరెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ సునీతలక్ష్మారెడ్డి, గజ్వేల్‌ జడ్జి ప్రియాంక, ఎంపీపీ జాలిగామ లత తదితరులు దర్శించుకున్నారు.

కుమారుడితో దిద్దిస్తున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

పల్లకీ సేవ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని