logo

నేతల కనుసన్నల్లో వక్ఫ్‌ స్థలాలు!

గజ్వేల్‌ పట్టణంలోని వక్ఫ్‌ బోర్డు స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు నియోజకవర్గానికి ఇద్దరు నేతలు గుట్టుగా చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 27 Jan 2023 04:09 IST

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పురపాలికలో ఇష్టారాజ్యం

వక్ఫ్‌బోర్డు స్థలంలో నిర్మించిన ఇంటిని కూల్చేస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, గజ్వేల్‌: గజ్వేల్‌ పట్టణంలోని వక్ఫ్‌ బోర్డు స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు నియోజకవర్గానికి ఇద్దరు నేతలు గుట్టుగా చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారికి, అనుచరులకు కొంత ముట్టజెప్పితే చాలు.. ఎలాంటి నిర్మాణం చేపట్టినా ఇబ్బందులు ఉండబోవని స్థానికులు చర్చించుకుంటున్నారు. వక్ఫ్‌బోర్డు స్థలంలో కొందరు గతేడాది కిందట రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలుసుకున్న బల్దియా అధికారులు జేసీబీలతో కూల్చి వేశారు. ఇప్పుడు అదే పరిసరాల్లో ఏకంగా ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నట్లు కనిపెట్టిన అధికారులు మరోమారు కూల్చివేతలకు దిగటం చర్చనీయాంశంగా మారింది. రూ.కోట్ల విలువ చేసే వక్ఫ్‌ బోర్డు స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. అక్రమ నిర్మాణాలు ఓ దశకు చేరేవరకు అధికారులు ఎందుకు మిన్నకుండిపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మసీదులు, దర్గాల నిర్వహణకు పూర్వం వక్‌్్ఫ బోర్డు కేటాయించిన ఈ భూముల్లో నిబంధనలు అతిక్రమించి ఎలాంటి నిర్మాణాలు, క్రయ విక్రయాలు చేయరాదని నిర్ణయించారు. చాలా చోట్ల ఏటా వాణిజ్య సముదాయాలు, ఇళ్ల నిర్మాణాలు సాగిపోతున్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం.. పట్టణంలో 292.29 ఎకరాలున్నాయి. ఇందులో 5.25 ఎకరాల్లో మసీదులు, ఈద్గాలు, ఇతర ప్రార్థన మందిరాలున్నాయి. కొంత స్థలం రోడ్ల విస్తరణలో కలిసిపోయింది. కబ్రస్థాన్‌, పాడుబడిన బావులు, కాలువలు, గుమ్మటాలు తదితరాలు పోనూ మిగతా సుమారు 200 ఎకరాలకుపైగా ఖాళీ స్థలం ఉంటుందని అధికారుల అంచనా. జాలిగామ రోడ్డులో కొంత భూమి సాగులో ఉండగా చాలా చోట్ల ఆక్రమణకు గురైందని స్థానికులు చెబుతున్నారు. పదిహేనేళ్లలో దాదాపు 80 ఎకరాలు ఆక్రమించారని గుర్తించారు. గడచిన రెండేళ్లలో అక్రమించిన వాటి విలువే రూ.10 కోట్లుంటుంది. నిర్మాణదారులకు పలు మార్లు తాఖీదులు జారీ చేశారు. మిగతావాటిని కాపాడేందుకు యత్నిస్తున్నా నేతలు ఈ భూములపై కన్నేసి, బినామీలతో నిర్మాణాలు చేయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

తాత్కాలిక చర్యలా...

* స్థలాల రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోకపోవటంతో కబ్జాలు ఆగటం లేదు. తాత్కాలికంగా నిర్మాణాలను పాక్షిక ధ్వంసం చేసి ఊరుకుంటున్నారు. తర్వాత యథావిధిగా చేపడుతుండటం గమనార్హం.

* రెండేళ్ల క్రితం గజ్వేల్‌ నుంచి తూప్రాన్‌ రోడ్డులో గోడలు కూల్చేశారు. రెండు నెలల్లో ఆ వ్యక్తి నిర్మాణం పూర్తి చేసి, పాత ఇంటి సంఖ్య వేశారు. చాలాకాలం క్రితమే కట్టుకున్నట్టు బుకాయిస్తున్నాడు.

* గుమ్మటం సమీపంలో గతేడాది ఇంటిని కూలగొట్టారు. అనంతరం కొద్ది నెలల్లో మళ్లీ నిర్మించారు.

* సినిమా థియేటర్‌ సమీపంలో ఓ నేత భారీగా కట్టుకుంటున్నారు.

* గజ్వేల్‌ ఇందిరాపార్కు నుంచి తూప్రాన్‌ రోడ్డులో, జాలిగామ బైపాస్‌ రోడ్డులో పలు పార్టీలకు చెందిన నాయకులు దుకాణ సముదాయాలు నిర్మించుకున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం: విజయేందర్‌రెడ్డి, ఆర్డీవో, గజ్వేల్‌

వక్ఫ్‌ బోర్డుకు చెందిన స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. ఎక్కడైనా ఉంటే చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని