logo

పోటీ అధికం.. కేటాయింపు స్వల్పం

జిల్లాలో పాపన్నపేట అతిపెద్ద మండలం. మైనార్టీలు 3,542 మంది ఉన్నారు. కేటగిరీ-1లో మూడు, కేటగిరీ-2లో ఒక యూనిట్‌ మాత్రమే కేటాయించారు.

Published : 29 Jan 2023 03:10 IST

56 యూనిట్లకు 2,239 దరఖాస్తులు

రామాయంపేట మండల పరిషత్తు కార్యాలయంలో ముఖాముఖి

* జిల్లాలో పాపన్నపేట అతిపెద్ద మండలం. మైనార్టీలు 3,542 మంది ఉన్నారు. కేటగిరీ-1లో మూడు, కేటగిరీ-2లో ఒక యూనిట్‌ మాత్రమే కేటాయించారు. మొత్తం 145 దరఖాస్తులు వచ్చాయి. యూనిట్ల సంఖ్య పెంచాలని డిమాండ్‌ చేస్తూ సదరు వర్గీయులు శుక్రవారం ఆందోళనకు దిగారు.

* జిల్లా కేంద్రం మెదక్‌లో 32 వార్డులు ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా 9,618 మంది మైనార్టీలు ఉండగా, కేటగిరీ-1లో ఏడు, కేటగిరీ-2లో రెండు యూనిట్లే ఇచ్చారు. 396 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో అత్యధిక అర్జీలు వచ్చింది ఇక్కడే గమనార్హం. ముఖాముఖిలు ఈనెల 27, 30 తేదీల్లో నిర్వహిస్తామని అధికారులు ప్రకటించి, ఆ తర్వాత రద్దు చేశారు.

న్యూస్‌టుడే, మెదక్‌, పాపన్నపేట

జిల్లాలో మైనార్టీ కార్పొరేషన్‌ రుణాల లబ్ధిదారుల ఎంపిక గందరగోళంగా మారింది. యూనిట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో వాటిని పెంచాలని ఆందోళనకు దిగుతున్నారు. ఏడేళ్ల తర్వాత కేటాయించడంతో నిరుద్యోగ యువత భారీగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తమకు బ్యాంకు రుణం అందుతుందా లేదా అన్న భావన నెలకొంది. వాటి సంఖ్య పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఏడేళ్ల తర్వాత..

జిల్లాలో మైనార్టీల జనాభా 51,318. ఆయా సంక్షేమ శాఖల ద్వారా ప్రభుత్వం స్వయం ఉపాధి నిమిత్తం బ్యాంకు రుణాలు అందజేస్తోంది. 2016-17లో అల్పసంఖ్యాకవర్గాల సంక్షేమ శాఖ ద్వారా యూనిట్లు మంజూరైతే.. తిరిగి 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయించారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేని యువత స్వయం ఉపాధికి వ్యాపారాలు చేస్తుంటారు. వారికి రాయితీ రుణాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇటీవల మైనార్టీ సంక్షేమశాఖ జిల్లాకు యూనిట్లను కేటాయించింది. కేటగిరీ-1లో రూ.లక్షకు 39, కేటగిరీ-2లో రూ.2 లక్షలకు 17 యూనిట్లు మంజూరు చేశారు. కేటగిరీ-1లో రూ.80 వేలు రాయితీ, రూ.20 వేలు బ్యాంకు రుణం, కేటగిరీ-2లో రూ.1.40 లక్షలు రాయితీ, రూ.60 వేలు బ్యాంకు రుణం అందజేయాలని ఉత్తర్వులు ఇచ్చారు ముస్లింలు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, పార్శిలకూ రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.

దరఖాస్తుల వెల్లువ..

రెండు విభాగాలలో కలిపి మొత్తం 56 యూనిట్లకు 2,239 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మెదక్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట పురపాలికలకు కేవలం 19 యూనిట్లు కేటాయించగా.. 633 అర్జీలు వచ్చాయి. హవేలి ఘనపూర్‌, మెదక్‌, చిలప్‌చెడ్‌, మనోహరాబాద్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రేగోడ్‌, రామాయంపేట మండలాలకు ఒక్కోటి మాత్రమే మంజూరైంది. 35 శాతం మహిళలకు, 5శాతం దివ్యాంగులకు, నిరుపేదలు, ఎలాంటి ఆధారం లేని మహిళలు, గతంలో కార్పొరేషన్‌ రుణం తీసుకోని వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలన్న ఆదేశాలున్నాయి. ఇప్పటికే పలు మండలాల్లో ముఖాముఖిలు సైతం పూర్తిచేశారు. ఈనెలాఖరు వరకు సదరు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలుండగా ఇంకా చాలాచోట్ల చేయాల్సి ఉంది. తక్కువగా యూనిట్లు మంజూరు చేయడంతో ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపిక కత్తిమీత సాముగాగా మారింది. మరోవైపు తమ అనుయాయులకు మంజూరుచేయాలని ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వం స్పందించాలి

స్వయం ఉపాధికి మైనారిటీ కార్పొరేషన్‌ రుణానికి దరఖాస్తు చేసుకున్నా. మండలానికి నాలుగు యూనిట్లు కేటాయించారు. 119 మంది ముందుకొచ్చారు. వీరిలో సగం మందికైనా కేటాయిస్తే బాగుంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలి.

- హైమద్‌అలీ, పాపన్నపేట

మార్గదర్శకాల మేరకు ఎంపిక

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపిక చేపడతాం. ఈనెల 30 వరకు ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు అర్హుల జాబితా పంపాలి. వాటిని పరిశీలించి తుది జాబితా రూపొందిస్తాం. అదనపు పాలనాధికారి ఆదేశాల మేరకు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటాం.

- జెమ్లానాయక్‌, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని