logo

సమస్యల వలయంలో వసతిగృహం

తాగునీరు లేక అవస్థలు.. ఉన్న ఫ్యాన్లు సరిగా పని చేయవు.. దోమలతో సహవాసం.. ఇక భోజనం అంతంతే.. ఇలా వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు హవేలిఘనపూర్‌ మండలం బూర్గుపల్లి బీసీ వసతిగృహ విద్యార్థులు.

Published : 29 Jan 2023 03:10 IST

న్యూస్‌టుడే, హవేలిఘనపూర్‌

రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు

తాగునీరు లేక అవస్థలు.. ఉన్న ఫ్యాన్లు సరిగా పని చేయవు.. దోమలతో సహవాసం.. ఇక భోజనం అంతంతే.. ఇలా వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు హవేలిఘనపూర్‌ మండలం బూర్గుపల్లి బీసీ వసతిగృహ విద్యార్థులు. ఆయా వాటి పరిష్కారానికి ఆందోళన బాట పట్టడం గమనార్హం.

80 మంది విద్యార్థులు.. : బూర్గుపల్లి వసతిగృహంలో 80 మంది ఉంటున్నారు. సమస్యలతో సహవాసం చేస్తూ వసతి పొందుతున్నారు. తాగునీరు కరవై ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు నిద్రించే గదుల్లో ఫ్యాన్లు సరిగా పని చేయడం లేదు. భవనం చుట్టూ అపరిశుభ్రత ఉండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంది. ట్యాంకులకు సరైన కప్పులు లేకపోవడంతో చెత్తాచెదారం వాటిలో పడి కలుషితం అవుతున్నాయి. ఆ నీటినే తాగాల్సి వస్తోందని పిల్లలు వాపోతున్నారు. ఆ నీటితోనే స్నానం చేయాల్సి వస్తుండటంతో శరీరంపై దద్దుర్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టిక పాటించకుండా..

వసతిగృహంలో పక్కాగా భోజనం అందించేందుకు ప్రభుత్వం ఓ పట్టికను నిర్దేశించింది. ఇక్కడ మాత్రం దాన్ని పాటించడం లేదని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 శౌచాలయాలకు మూడు మాత్రమే పని చేస్తుండటంతో అత్యవసర వేళ నానాపాట్లు పడాల్సి వస్తోంది. ఆవరణలోకి పశువులు వచ్చి అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. వీటితో విసిగిపోయిన విద్యార్థులు శనివారం బూర్గుపల్లి నుంచి గాజిరెడ్డిపల్లికి వెళ్లే మార్గంలో భైఠాయించి ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని, వసతిగృహ అధికారి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మద్యం తాగి విధులకు హాజరవుతున్నాడని, విధుల నుంచి తొలగించాలన్నారు. ఎస్‌ఐఫ్‌ఐ ఆధ్వర్యంలో గంటన్నర పాటు ధర్నా కొనసాగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, హవేలిఘనపూర్‌ తహసీల్దారు నవీన్‌కుమార్‌, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అసిస్టెంట్‌ అధికారి నాగరాజుగౌడ్‌ అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. ఇబ్బందులు తీరుస్తామని హామీ ఇచ్చి శాంతింపజేశారు. అనంతరం జిల్లా బీసీ సంక్షేమాధికారి కేశురాం వసతిగృహాన్ని పరిశీలించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని