logo

యువకుడి దారుణ హత్య

మండల పరిధి బుధేరా శివారులో యువకుడిని దారుణంగా హత్య చేశారు. మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.

Published : 29 Jan 2023 03:10 IST

మృతదేహంపై పెట్రోల్‌ పోసి దహనం

మునిపల్లి, న్యూస్‌టుడే: మండల పరిధి బుధేరా శివారులో యువకుడిని దారుణంగా హత్య చేశారు. మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మునిపల్లి ఎస్సై చల్లా రాజశేఖర్‌ తెలిపిన వివరాలు.. బుధేరాకు చెందిన కొలుకుందె కొమురయ్య (35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. స్నేహితులతో జల్సాలకు అలవాటు పడ్డాడు. 2014లో మునిపల్లి జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. శుక్రవారం రాత్రి బుధేరా శివారులో హత్యకు గురయ్యాడు. దుండగులు రాయితో తలపై కొట్టి హత్యకు పాల్పడ్డారు. శనివారం పంట పొలాలకు వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి సదాశివపేట సీఐ సంతోష్‌కుమార్‌, మునిపల్లి ఎస్సై చల్లారాజశేఖర్‌ చేరుకొని క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లను రప్పించారు. వివరాలు సేకరించారు. మృతదేహాన్ని గుర్తించకుండా దుండగులు పెట్రోలు పోసి దహనం చేసినట్టు వివరించారు. కొమురయ్య తండ్రి కిష్టయ్య ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


చందంపేటలో వృద్ధురాలిని..

చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే: ఆభరణాలు దోచుకొని వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేటలో చోటుచేసుకుంది. రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. చందంపేటకు చెందిన వడియారం ఎల్లమ్మ (75).. తన కుమారుడు నాగులు వద్ద ఉంటోంది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇదే గ్రామానికి చెందిన సిద్దిరాంలు మాయమాటలు చెప్పి పాడుబడిన ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. ఆమెను తీగలతో అక్కడ బంధించి కర్రతో కొటి ఉరేసి హతమార్చాడు. ఆమె బంగారు కమ్మలు, మెడలో ఉన్న గుండ్లను ఎత్తుకెళ్లాడు. దీన్ని గమనించిన సిద్దిరాంలు భార్య మంగమ్మ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకునేలోపు నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ, ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌లు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. హతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు