logo

ఆశావహ దృక్పథం.. సమగ్ర అవగాహనే కీలకం

శ్రమిస్తే విజయం ఖాయం.. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగడమే కీలకం.. ప్రణాళికే ప్రధానం.. సమయం సద్వినియోగం అన్నింటి కంటే ముఖ్యం.. ఇవే ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు కీలకాంశాలు. వీటిపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ గ్రూప్‌-1 అధికారుల సంఘం, గ్రంథాలయ సంస్థ సంయుక్తాధ్వర్యంలో సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.

Published : 29 Jan 2023 03:10 IST

ఈనాడు, సంగారెడ్డి

జ్యోతి వెలిగిస్తున్న ఆయాచితం శ్రీధర్‌, ప్రతినిధులు

శ్రమిస్తే విజయం ఖాయం.. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగడమే కీలకం.. ప్రణాళికే ప్రధానం.. సమయం సద్వినియోగం అన్నింటి కంటే ముఖ్యం.. ఇవే ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు కీలకాంశాలు. వీటిపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ గ్రూప్‌-1 అధికారుల సంఘం, గ్రంథాలయ సంస్థ సంయుక్తాధ్వర్యంలో సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రముఖులు సూచనలు ఇచ్చారు.

అందుబాటులో పుస్తకాలు..

ముందుగా సదస్సును రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయల్లో పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా, సమయాన్ని వినియోగించుకునేలా ప్రణాళికతో ముందుకెళ్తే కొలువు సాధించొచ్చని రవాణాశాఖ ఉప కమిషనర్‌ శివలింగయ్య చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ నరహరిరెడ్డి అధ్యక్షతన సాగిన సదస్సులో నూతనకంటి వెంకట్‌, హరికిషన్‌, విష్ణు, మధుబాబు, వెంకటేశ్వర్‌రెడ్డి, శిరీష తదితరులు పాల్గొన్నారు.

ఆత్మన్యూనత వీడండి: మామిండ్ల చంద్రశేఖర్‌ గౌడ్‌, రాష్ట్ర అధ్యక్షుడు, గ్రూప్‌ 1 అధికారుల సంఘం

గ్రామీణ ప్రాంతం నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే చాలా మందిలో ఆత్మన్యూనత భావం ఉంటుంది. మిగతా వారితో పోటీపడలేమని అనుకుంటారు. కానీ ఈ ఆలోచనను మనసులో నుంచి తీసేయండి. కీలక స్థానాల్లో ఉన్న వారంతా గ్రామీణ ప్రాంతీయులేనని గుర్తుంచుకోవాలి. పరీక్షా విధానంపై అవగాహనతో పాటు ఏ సిలబస్‌ చదవాలనే విషయమూ కీలకమే. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం జోనల్‌ విధానాన్ని తెచ్చింది.

వీలైనన్ని నమూనా పరీక్షలు..
- రాజాక్రిష్ణ, ఉప కమిషనర్‌, వాణిజ్య పన్నుల శాఖ

మనం సిద్ధమవుతున్న పరీక్షకు సంబంధించిన సిలబస్‌ మీద పూర్తి అవగాహన ఉండాలి. పాఠ్యాంశానికి ఎన్ని మార్కులు వస్తాయనే విషయమూ కీలకమే. సమయాన్ని వినియోగించుకోవాలి. మనకు నచ్చిన అంశానికే కాకుండా, అన్నింటికి సమప్రాధాన్యం ఇస్తేనే ఎక్కువ మార్కులు సాధించగలం. నమూనా ప్రశ్నపత్రాలను ఎక్కువ సార్లు రాయాలి. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అర్హత సాధించిన వారికి రాతపరీక్షకు ఉపయోగపడుతుంది. ఎక్కడ ఇబ్బంది పడుతున్నామనే విషయం తెలుస్తుంది.

నేరుగా వెళ్లి చూస్తే..
- కాకర్ల శ్రీనివాస్‌, జీఎం, పౌరసరఫరాల విభాగం

పోటీపరీక్షల్లో తెలంగాణ చరిత్ర నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి. పుస్తకాల్లో విషయాలను చదవడమే కాదు.. అందుబాటులో ఉన్న చారిత్రక ప్రాంతాలు, మ్యూజియాలు చూస్తే ప్రయోజనం దక్కుతుంది. రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి జిల్లాకు విశిష్టస్థానం ఉంది. ఈ విషయాన్నీ గమనించాలి. చాలా మందికి ఏ పుస్తకాలు చదవాలనే అనుమానం ఉంటుంది. తెలంగాణ అకాడమీ పుస్తకాలైతే బాగుంటుందనేది నా సూచన. మారిన పరీక్షా విధానాల గురించి మనం తెలుసుకోవాలి.

వివిధ అంశాలను..
- రజనీకాంత్‌రెడ్డి, ఉప కమిషనర్‌, జీహెచ్‌ఎంసీ

ఎలాంటి అపోహలకు తావీయకూడదు. పరీక్షలు సమీపిస్తున్న కొద్ది చాలా మంది వివిధ అంశాలను ప్రచారం చేస్తారు. పరీక్షలు వాయిదా పడతాయని, సిలబస్‌ మారిందని.. ఇలా ఏవేవో చెబుతారు. వాటిని పట్టించుకుంటే ఇబ్బందుల పాలవుతాం. ఉద్యోగ ఖాళీల్లో ఒకటి మనదేనన్న ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి. విధులు కఠినంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి పోటీపరీక్షలకు సిలబస్‌ను పెంచారు. అన్ని అంశాలపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి.

స్థిర లక్ష్యం..
- నరేష్‌, గ్రూప్‌ 2 టాపర్‌ (2016)

నేను మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను. ఉన్నతస్థాయికి ఎదగాలనే తపనతో చదివా. గ్రూప్‌ 2 పరీక్షల్లో టాపర్‌గా నిలిచా. ఉద్యోగాల భర్తీకి వరుస ప్రకటన       వెలువడుతున్నాయి. చాలా మంది పోటీలో ఉంటారు. మనం సాధించగలమా అని అధైర్యపడొద్దు. స్థిరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దాని సాధనకు నిరంతర కృషి చేయాలి. ప్రజాసేవ చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగం ఎంతో ఉపకరిస్తుంది.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు