logo

క్రీడా మైదానాలకు రక్షణేది?

విద్యార్థులు, యువత ఆటల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఊరూరా క్రీడా మైదానాలను ఏర్పాటు చేసింది. 

Updated : 29 Jan 2023 06:48 IST

కబ్జాకు గురవుతున్నా చర్యలు కరవు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, జోగిపేట, కోహిర్‌, మునిపల్లి

పోసానిపేటలో స్థలం చుట్టూ వేసిన కంచె

విద్యార్థులు, యువత ఆటల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఊరూరా క్రీడా మైదానాలను ఏర్పాటు చేసింది. వాటిపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. హద్దులు చెరిపేస్తూ.. పక్కనున్న స్థలాల్లో కలిపేసుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల కంచెలు వేయడం, కడీలు పాతడం, షెడ్లు వేయడం లాంటివి చేస్తున్నారు. ఇటీవల చౌటకూరు మండలం శివ్వంపేటలో ప్రభుత్వ బడికి చెందిన ఆట స్థలాన్ని రక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో కథనం.

క్షేత్ర స్థాయి పరిస్థితి..

అందోలు మండల పరిధి పోసానిపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన క్రీడా మైదానాన్ని ఇటీవల ఓ వ్యక్తి కబ్జాకు చేశాడు. రహదారికి సమీపంలోనే ఉండటం వల్ల ఆ స్థలం అత్యంత ఖరీదైనది. ఇక్కడ సుమారు పావు ఎకరా వరకు పరాధీనమైనట్టు స్థానికులు తెలిపారు. స్థానిక ఓ వర్గం వారు ఆక్రమణను అడ్డుకోగా.. మరొక వర్గం ఆక్రమణదారుకు మద్దతు పలుకుతోంది.

కోహిర్‌ మండలం గుర్జువాడ జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం ఎకరా 3 గుంటల వరకు ఉంది. చుట్టుపక్కల వారు అర ఎకరం వరకు ఆక్రమించుకున్నారు. సర్వే చేసి హద్దులు చూపాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు.

మునిపల్లి మండలంలోని అంతారం ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని క్రీడా మైదానం కొంత భాగం కబ్జాకు గురైంది. అందులో ఓ వ్యక్తి ఇంటిని నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు.

జోగిపేట పట్టణంలోని ఎన్టీఆర్‌ క్రీడా మైదానంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మైదానానికి ఓ మూలన తొలుత కొందరు గుడిసెలు నిర్మించుకున్నారు. ఆ తర్వాత పక్కా ఇళ్లు నిర్మిస్తున్నారు. అధికారులు సర్వే చేస్తే.. ఆ స్థలం ఎంతమేరకు పరాధీనమైందో తేలుతుంది.

చౌటకూరు మండలంలోని శివ్వంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన కొంత స్థలం పరాధీనమైంది. ఆ స్థలాన్ని ఆక్రమణ చెర నుంచి విడిపించాలని గ్రామస్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఇటీవల ఆందోళనకు దిగారు. 161వ జాతీయ రహదారికి పక్కనే ఈ మైదానం ఉంది. ఇక్కడ ఎకరం రూ.కోట్లలో ధర పలుకుతుంది.

సమన్వయంతో వ్యవహరిస్తేనే..

జిల్లాలోని కొన్ని చోట్ల పాఠశాలల్లోని క్రీడా మైదానాలు ఆక్రమణకు గురవుతున్నాయి. వెంటనే స్థానిక పాలక వర్గాలు వాటి రక్షణకు చర్యలు చేపట్టాలి. రాజకీయ నేతల ప్రమేయం, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, విద్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడం సమస్యగా మారిందనే ఆరోపణలున్నాయి. విద్యా కమిటీ ప్రతినిధులు, స్థానిక సర్పంచి, వార్డు సభ్యులు సమన్వయంతో వ్యవహరిస్తే క్రీడా మైదానాలను రక్షించే అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు.


విచారించి చర్యలు తీసుకుంటాం..

- రాజేశ్‌, జిల్లా విద్యాశాఖాధికారి

ప్రభుత్వ పాఠశాలల క్రీడా మైదానాలు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ క్రీడా స్థలాలు పరాధీనమయ్యాయో.. ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోల ద్వారా నివేదికలు తెప్పించుకుంటాం. పూర్తి స్థాయిలో విచారించి... వాటిని కాపాడేందుకు కృషి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని