logo

దుకాణాల ఏర్పాటుకు వ్యాపారుల అనాసక్తి

వ్యాపార, వాణిజ్య అవసరాలకు రూ.11 కోట్లతో తూప్రాన్‌లో నిర్మించిన సమీకృత విపణి సముదాయంలో దుకాణాలు(షట్టర్లు) అద్దెకు తీసుకునే వారు కరవయ్యారు.

Published : 30 Jan 2023 02:56 IST

తూప్రాన్‌  సమీకృత విపణిలో తీరిది..

 

న్యూస్‌టుడే, తూప్రాన్‌: వ్యాపార, వాణిజ్య అవసరాలకు రూ.11 కోట్లతో తూప్రాన్‌లో నిర్మించిన సమీకృత విపణి సముదాయంలో దుకాణాలు(షట్టర్లు) అద్దెకు తీసుకునే వారు కరవయ్యారు. గతేడాది సెప్టెంబరు 2న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభించారు. రోడ్డు వైపు 10 వ్యాపార వాణిజ్య దుకాణాలు, లోపల కూరగాయల విక్రయాలు, మొదటి అంతస్తులో మాంసం దుకాణాలు, రెండో అంతస్తులో షాపింగ్‌మాల్స్‌ ఏర్పాటుకు అనుగుణంగా భవనాన్ని నిర్మించారు. మొదటి అంతస్తులో కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేయగా.. రెండో అంతస్తులో మాంసం దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అధిక ఆదాయం వచ్చేలా రోడ్డు వైపు నిర్మించిన 10 దుకాణ గదులు ప్రారంభం నుంచి ఖాళీగానే ఉంటున్నాయి. దీంతో అరకొర ఆదాయంతోనే సమీకృత మార్కెట్‌ను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణానికి దూరంగా ఉండడంతో వ్యాపారస్తులు ఆసక్తి చూపడం లేదని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కథనం.

కనీస అద్దెగా రూ.3300

తూప్రాన్‌లో నిర్మించిన సమీకృత విపణి భవనంలో వాణిజ్య దుకాణాల ఏర్పాటుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఇప్పటి వరకు మూడుసార్లు టెండర్లు పిలిచారు. దరఖాస్తులు తక్కువగా రాకపోవడంతో ఈ ప్రక్రియను నిలిపివేశారు. ఒక్కో దుకాణానికి నెలకు కనీస అద్దెగా రూ.3300 నిర్దేశించారు. డిమాండ్‌ను బట్టి పెంచే ఆలోచన చేసినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో కనీస అద్దెకు ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. ఇదే విషయాన్ని మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రస్తుతం నెలకు రూ.3.50లక్షల ఆదాయం సమకూరాల్సి ఉండగా.. రూ.1.50లక్షలు మాత్రమే వస్తోంది. వ్యాపారాలు సరిగా నడవని కారణంతో పలువురు అద్దెలు సక్రమంగా చెల్లించడం లేదు.


మరోసారి టెండర్‌ నిర్వహిస్తాం..

షాబుద్దీన్‌, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి

తూప్రాన్‌ సమీకృత విపణి భవనం కొత్తగా నిర్మించడంతో వ్యాపారాలు ఇంకా పెరగాల్సి ఉంది. గతంలో టెండర్లు పిలవగా.. అనుకున్నంత మేర దరఖాస్తులు రాలేదు. మరోసారి టెండర్‌ వేస్తాం. స్పందన లేకుంటే ముందుకు వచ్చే వారికి కనీస అద్దెకు దుకాణాలను కేటాయిస్తాం. ఆసక్తి ఉన్న వ్యాపారులు మార్కెటింగ్‌ అధికారులను సంప్రదించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని