logo

నడివయసు.. తీరుతున్న ఆయుష్షు

ఇంటిపెద్దను కోల్పోయిన రైతు కుటుంబానికి అండగా నిలవాలన్నదే రైతు బీమా పథక ఉద్దేశం. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలోనే రూ.5 లక్షలు అందిస్తున్నారు.

Published : 30 Jan 2023 02:56 IST

అర్థగణాంక నివేదికలో వెల్లడి

బీమా పత్రం అందజేస్తూ..

ఈనాడు, సిద్దిపేట: ఇంటిపెద్దను కోల్పోయిన రైతు కుటుంబానికి అండగా నిలవాలన్నదే రైతు బీమా పథక ఉద్దేశం. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలోనే రూ.5 లక్షలు అందిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర అర్థగణాంక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూరింది. దీన్ని పరిశీలిస్తే 49 నుంచి 59 ఏళ్ల లోపున్న వారు అధికంగా మృతి చెందినట్లు తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో దీనికి కారణాలు, తదితర అంశాలపై ‘ఈనాడు’ అందిస్తున్న కథనం.

వివిధ కారణాలు..

కనీసం గుంట భూమి ఉండి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదై ఉన్న వారు రైతు బీమాకు అర్హులు. 18 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న వారు చనిపోతే వారి కుటుంబానికి ప్రయోజనం దక్కుతుంది. సంబంధిత ధ్రువపత్రాలను స్థానిక ఏఈవోకు అందిస్తే ఆన్‌లైన్‌లో సమాచారాన్ని పొందుపరిచి, ధ్రువపత్రాలు జతచేస్తారు. మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు ఏ కారణంతో చనిపోయారనే విషయాన్ని సైతం నమోదు చేస్తున్నారు. ఎక్కువ మంది అనారోగ్య కారణాలతో పాటు కుటుంబ కలహాలు, ఇతరత్రా సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సదరు గణాంకాలు తేల్చాయి. రోడ్డు ప్రమాదాలు, విద్యుదాఘాతాలు, ఇతర కారణాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వీళ్లే అధికంగా..

ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో పరిశీలిస్తే 49-59 ఏళ్లున్న వారే అధికంగా మరణించినట్లు స్పష్టమవుతోంది. 59 ఏళ్లు పైబడిన వారు చనిపోతే బీమా వర్తించదు. దీంతో ఆయా వివరాలు అధికారులు సేకరించడం లేదు. 2018-19 నుంచి 2021-22 వరకు ఈ నాలుగు జిల్లాల పరిధిలో 17,143 మందికి బీమా ప్రయోజనం దక్కగా.. అందులో 49-59 ఏళ్ల వయసున్న వారు 8,057 ఉన్నారు.

కౌలు రైతులకు దక్కక..

కనీసం గుంట భూమి ఉన్నా ప్రయోజనం దక్కుతోంది. కౌలుదారులకు మాత్రం ఊరట దక్కడం లేదు. వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకం ద్వారా తమకు ఒక్క రూపాయి కూడా లాభం ఉండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో కౌలు రైతుల సంఖ్యే అధికంగా ఉంటోంది. అయితే వారి కుటుంబానికి భరోసా దక్కడం లేదు. ఇకనైనా ప్రభుత్వం దీనిపై దృష్టిసారిస్తే మేలు.

కుమార్తె పెద్ద దిక్కయి..

న్యూస్‌టుడే, మెదక్‌, వెల్దుర్తి: వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్‌పూర్‌కు చెందిన శ్రీశైలానికి 28 గుంటల భూమి ఉంది. నాలుగేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త అకాల మరణంతో దు:ఖాన్ని దిగమింగుకొని నలుగురు పిల్లలను చదివిస్తుండగా మమత సైతం చనిపోయారు. దీంతో తల్లిదండ్రులు కోల్పోయిన నలుగురు పిల్లలు అనాథలయ్యారు. పెద్ద కుమార్తె కీర్తన 8వ తరగతితో చదువు ఆపేసి, ప్రస్తుతం కుట్టుశిక్షణ పొందుతోంది. ఆమె చెల్లెలు హారిక వెల్దుర్తి కస్తూర్బాలో, తమ్ముళ్లు సాయి రక్షిత్‌, సాయిప్రణీత్‌ నర్సాపూర్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోని బడిలో చదువుకుంటున్నారు. కీర్తన వారి బాధ్యతలను చూసుకుంటున్నారు. రైతుబీమా ద్వారా రూ.5 లక్షలు రాగా వాటిని పిల్లల పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. 

వివరాల సేకరణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని