logo

వాయు కాలుష్యం.. జనం ఉక్కిరిబిక్కిరి..

మండల పరిధి గడ్డపోతారం పారిశ్రామికవాడలోని పలు రసాయన పరిశ్రమల తీరు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Published : 30 Jan 2023 02:56 IST

గడ్డపోతారం పారిశ్రామికవాడలో కట్టడికి చర్యలు కరవు

న్యూస్‌టుడే, జిన్నారం: మండల పరిధి గడ్డపోతారం పారిశ్రామికవాడలోని పలు రసాయన పరిశ్రమల తీరు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గాలిలో రసాయన రేణువులు 0.250 ఉన్నట్టు సూచీలు సూచిస్తుండగా.. దీన్ని అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. ఘాటు వాసనతో కళ్లు తిరగడం, వాంతులు చేసుకోవడం లాంటి ఇబ్బందులు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. కాలుష్య నివారణకు చేపట్టాల్సిన చర్యలు కానరాకపోవడం, పీసీబీ అధికారులు పట్టించుకోక పోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి ప్రాంతాల్లో ఇటీవల ఈ సమస్య అధిగమైన తీరుపై కథనం.

ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు..

పారిశ్రామికవాడలో ఉష్ణోగ్రతలు పడిపోయి.. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దయనీయ పరిస్థితులుంటున్నాయి. రసాయన, మురుగు, ఘాటు వాసనలు అధికమవుతున్నాయి. వారం, పది రోజులుగా ఈ  సమస్య తీవ్రమైంది. కాలుష్య కట్టడికి చాలా పరిశ్రమలు స్క్రబ్బర్లు మార్చడం లేదు. ఫిల్టర్‌ కాకుండానే ఉత్పత్తుల ద్వారా వచ్చే రసాయన జలాలు, వాయువులను వదులుతున్నారు. ఫోర్స్‌డ్‌ ఎవాపరేషన్‌ విధానంలో నియంత్రించే అవకాశమున్నా.. నిబంధనలు పాటించడం లేదు. ఈ సమస్యను గుర్తించడానికి ప్రతి పరిశ్రమ ఎదుట ఎలక్ట్రానిక్‌ పరికరాలను అమర్చారు. కాలుష్య వివరాలు డిస్‌ప్లే అవుతాయి. వాటిని పీసీబీ కార్యాలయానికి అనుసంధానించారు. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో కాలుష్య నియంత్రణ చర్యలు కరవయ్యాయి.

ఇళ్లలో ఉండలేకపోతున్నాం: పావని, చెట్లపోతారం

పరిశ్రమల వల్ల ప్రతి రోజు నరకం అనుభవిస్తున్నాం. తీవ్ర వాయు కాలుష్యం ఇబ్బంది పెడుతోంది. రేయింబవళ్లు ఇదే పరిస్థితి ఉంటోంది. చలికాలంలో తీవ్రమైంది. కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలి.

ఎవరూ పట్టించుకోవడం లేదు: గణేశ్‌, గడ్డపోతారం

సమస్య ఏళ్లుగా కొనసాగుతోంది. విషవాయువుల తాకిడికి ఊళ్లో ఉండలేని పరిస్థితి. ప్రత్యామ్నాయం లేక ఇక్కడే ఉండక తప్పడం లేదు. అధికారులకు సమస్య విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఇకనైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి.

వెంటనే స్పందిస్తున్నాం..: కుమార్‌పాఠక్‌, పీసీబీ ఈఈ, రామచంద్రాపురం

సమస్యను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్పందిస్తున్నాం. మూడు రోజు క్రితం మా బృందం వెళ్లి పరిశీలన చేసింది. నిఘాతో కాలుష్య కారకులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని