logo

నిత్య పరీక్ష.. నేత్రాలకు రక్ష

అంధత్వ నివారణకు చేపట్టిన ‘కంటి వెలుగు’ జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతోంది. ఎక్కువ మంది నేత్ర సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది.

Published : 03 Feb 2023 01:03 IST

సంగాయిగూడ తండాలో కంటి పరీక్ష

న్యూస్‌టుడే-మెదక్‌, మెదక్‌ రూరల్‌: అంధత్వ నివారణకు చేపట్టిన ‘కంటి వెలుగు’ జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతోంది. ఎక్కువ మంది నేత్ర సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది. చాలా మందికి చూపు మందగించడం, శుక్లాల ఇబ్బందులు నిర్ధారణ అవుతున్నాయి. ఈ అంశంపై ‘న్యూస్‌టుడే’ కథనం.

జిల్లా వ్యాప్తంగా నేత్ర పరీక్షలు నిర్వహించేందుకు 40 బృందాలను ఏర్పాటు చేశారు. జనవరి 19న కార్యక్రమం ప్రారంభం కాగా, శని, ఆదివారాల్లో మినహాయించి మిగతా రోజుల్లో శిబిరాలు కొనసాగుతున్నాయి. కంటి జబ్బులతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందుల పంపిణీతో పాటు వైద్యసలహాలు అందిస్తున్నారు. పని ఒత్తిడి, ఉద్యోగ భారం, చరవాణి, కంపూటర్ల వినియోగం తదితర కారణాలే సమస్యలకు కారణమవుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్థులకు డయాబెటిక్‌ రెటినోపతి లక్షణాలను గుర్తించే యంత్రం లేకపోవడంతో చాలా మంది నిరాశగా వెనుదిరుగుతున్నారు.


రెండింటితో సతమతం

ఇప్పటివరకు నిర్వహించిన శిబిరాల్లో చాలా మంది దగ్గరి, దూరపు చూపుతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దగ్గరి చూపులో ఇబ్బంది ఉండేవారికి అద్దాలను అందజేశారు. దూరపు సమస్య ఉన్న వారికి తగిన అద్దాలు తెప్పించి, 15 రోజుల్లో అందజేస్తారు. శిబిరాల్లో వీరి పూర్తి వివరాలను నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా చుక్కల మందుతో పాటు విటమిన్‌ ఏ, డీ, బీకాంప్లెక్స్‌ మాత్రలను పంపిణీ చేస్తున్నారు.


సగటున 120 మందికి పరీక్షలు

పంచాయతీలు, పురపాలికల్లో షెడ్యూల్‌ ప్రకారం శిబిరాలు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాలకు బృందాలు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిత్యం 137 మందికి పరీక్షలు నిర్వహించాలనేది లక్ష్యం కాగా, ప్రస్తుతం 120 మందికి పరీక్షిస్తున్నారు. గురువారం కలెక్టరేట్‌లో శిబిరం ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు కొనసాగనుంది. స్వయం సహాయక సంఘాల మహిళలు, ఆశాకార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేస్తూ, శిబిరం ఏర్పాటు సమాచారాన్ని అందజేస్తున్నారు.


ప్రయాస తప్పింది

కంటి పరీక్షలకు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. ఊర్లోనే చేయించడం వల్ల ప్రయాసతో పాటు డబ్బుల ఖర్చు తప్పింది. నేత్ర సమస్య ఉండటంతో ఇక్కడికి వచ్చా. అద్దాలు ఇచ్చారు. తండావాసులందరు సద్వినియోగం చేసుకుంటున్నారు.

కాట్రోజ్‌ కిషన్‌, సంగాయిగూడ తండా, మెదక్‌ మండలం


స్పందన లభిస్తోంది

ప్రతిరోజు ప్రజలనుంచి స్పందన లభిస్తోంది. అద్దాలు అవసరం ఉన్న వారికి వెంటనే ఇస్తున్నాం. ఇప్పటి వరకు వచ్చిన 32వేల అద్దాలలో ఏడువేలకు పైగా అందజేశాం. దూరదృష్టిలోపం ఉన్న వారి వివరాలను నమోదు చేసుకుని, వారికి 15 రోజుల తర్వాత కళ్లాద్దాలు అందజేయనున్నాం.

చందునాయక్‌, జిల్లా వైద్యాధికారి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు