logo

ఇంటింటికీ వెళ్లి అవగాహన

ఓటరు జాబితా ప్రకారం ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని పాలనాధికారి రాజర్షిషా స్థానిక అధికారులను ఆదేశించారు.

Published : 03 Feb 2023 01:03 IST

శిబిరం వద్ద నమోదు వివరాలను తెలుసుకుంటున్న పాలనాధికారి రాజర్షిషా

కౌడిపల్లి, న్యూస్‌టుడే: ఓటరు జాబితా ప్రకారం ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని పాలనాధికారి రాజర్షిషా స్థానిక అధికారులను ఆదేశించారు. గురువారం కౌడిపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీల్లో వార్డుల వారీగా తిరుగుతూ శిబిరాలకు వచ్చేలా చూడాలన్నారు. ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శులు, వీవోఏలు, ఆశా కార్యకర్తలు అందరినీ కలిసి ఆహ్వానించాలని తెలిపారు. గ్రామస్థుల అవసరాల మేరకు ఉదయమే పరీక్షలను ప్రారంభించాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి శిబిరాలను విజయవంతం చేయాలని, నిర్లక్ష్యం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శిబిరంలో స్టాంపింగ్‌ లేకపోవడంతో స్థానిక వైద్యాధికారి శ్రీకాంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం చేస్తావా ఇంటికి వెళతావా అని హెచ్చరిస్తూ తాఖీదు జారీ చేయాలని జిల్లా వైద్యాధికారి చందూనాయక్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఉప వైద్యాధికారిణి విజయనిర్మల, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఉపతహసీల్దార్‌ తారాబాయి ఉన్నారు.
స్వీప్‌ నోడల్‌ అధికారికి అభినందనలు : మెదక్‌, న్యూస్‌టుడే: ఓటరు నమోదు, ఆధార్‌ అనుసంధానం, స్వీప్‌ కార్యక్రమాల నిర్వహణలో విశేష కృషిచేసినందుకు రాష్ట్ర స్థాయి ప్రత్యేక కేటగిరీ అవార్డు అందుకున్న నోడల్‌ అధికారి రాజిరెడ్డిని పాలనాధికారి రాజర్షిషా అభినందించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అందజేసిన ప్రశంసాపత్రం, మెమెంటోను ఆయన పాలనాధికారికి చూపించారు. కార్యక్రమంలో అదనపు పాలనాధికారి రమేశ్‌ పాల్గొన్నారు. అంతకుముందు టీఎన్జీవోలు పాలనాధికారి రాజర్షిషాను కలిసి అభినందనలు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షులు నరేందర్‌, కార్యదర్శి రాజ్‌కుమార్‌, బాధ్యులు అనురాధ, ఇక్బాల్‌పాషా, ఫజలుద్దీన్‌, రఘునాథ్‌రావు, విక్రంరెడ్డి, రామాగౌడ్‌లు పాలనాధికారిని కలిసిన వారిలో ఉన్నారు.

ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి : కంటిచూపుతో బాధపడుతున్న వారికి కంటివెలుగు కార్యక్రమం వరమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆమె కలెక్టరేట్లో పాలనాధికారి రాజర్షిషాతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన వారు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ రోహిణిప్రియదర్శిని,అదనపు పాలనాధికారులు రమేశ్‌, ప్రతిమాసింగ్‌, డీఎంహెచ్‌వో చందునాయక్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని