logo

‘ఉపాధి’కి కోత... సేంద్రియానికి ఊతం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆయా రంగాలపై ప్రతికూల, అనుకూల ప్రభావాలు చూపనున్నాయి.

Published : 03 Feb 2023 01:03 IST

న్యూస్‌టుడే, మెదక్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆయా రంగాలపై ప్రతికూల, అనుకూల ప్రభావాలు చూపనున్నాయి. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినప్పటికి... గ్యాస్‌ ధర విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిరుద్యోగ యువతకు ఎలాంటి వరాలు ప్రకటించలేదు. పనులు లేక సొంత ఊరిలో ఉపాధి పనులకు వెళ్లే కూలీలపై ప్రభావం పడనుంది. వలసలను నివారించేందుకు తీసుకవచ్చిన ఉపాధి పథకానికి కేంద్రం ఈ బడ్జెట్‌లో నిధులను తగ్గించింది. గతేడాది రూ.93 వేల కోట్లకు పైగా కేటాయించగా, ఈ దఫా రూ.20 వేల కోట్లు తగ్గిస్తూ, రూ.73 వేల కోట్లకు పరిమితం చేశారు. రాష్ట్ర స్థాయిలో మెతుకుసీమ ఉపాధి పనుల్లో టాప్‌ -5లో నిలుస్తోంది.


ఆన్‌లైన్‌లోకి సహకారం

చిన్న, సన్నకారు రైతుల సంక్షేమానికి సహకార వ్యవస్థ ఆధారిత ఆర్థిక నమూనాను అవలంభిస్తున్నట్లు బడ్జెట్‌లో వెల్లడించారు. దీని కోసం దేశ వ్యాప్తంగా ప్రాథమిక సహకార పరపతి సంఘా (పీఏసీఎస్‌-ప్యాక్స్‌)లను కంప్యూటీకరణ చేయాలని నిర్ణయించారు. దీనికి రూ.2,516 కోట్లు కేటాయించగా, జిల్లాలోని పలు ప్యాక్స్‌లకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు మార్కెటింగ్‌ను ప్రోత్సహించేందుకు నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సాగుకు అనుబంధంగా ఉన్న చేపలు, పశువులు, జీవాల పెంపకానికి సహకారం అందించేందుకు కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  దీని వల్ల సంఘాల సభ్యులతో పాటు అన్నదాతలకు కొంత మేర ప్రయోజనం కలగనుంది. జిల్లాలో 37 సోసైటీలున్నాయి.


రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా..

పంటల సాగులో ఎరువుల వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో ఖర్చులు, కాలుష్యం పెరిగి, చీడపీడలు సోకుతున్నాయి. వాటి నివారణకు పురుగుమందులపై విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో సేంద్రియ సేద్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం కోటి మంది రైతులను ప్రోత్సహించనుంది. వీరికి సూక్ష్మ ఎరువులు, పురుగు మందులను సరఫరా చేయడానికి బయో ఇన్‌పుట్‌ రిసోర్సు సెంటర్లను ఏర్పాటు చేస్తారు. రసాయన ఎరువుల సమతుల వినియోగాన్ని పెంచేందుకు పీఎం ప్రణామ్‌ కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. ఇప్పటికీ జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి క్లస్టర్‌లో 50 ఎకరాల్లో సాగు జరిగేలా దృష్టి సారించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు