logo

‘జాతరలో భక్తులకు అసౌకర్యం కలిగించొద్దు’

ఏడుపాయల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని పాలనాధికారి రాజర్షిషా సూచించారు.

Published : 04 Feb 2023 01:49 IST

ఏర్పాట్లపై ఆరా తీస్తున్న పాలనాధికారి రాజర్షిషా, అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్‌, రమేశ్‌, ఎస్పీ రోహిణిప్రియదర్శిని

పాపన్నపేట, న్యూస్‌టుడే: ఏడుపాయల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని పాలనాధికారి రాజర్షిషా సూచించారు. ఈ నెల 18 నుంచి 20 వరకు జరిగే జాతరను పురస్కరించుకుని శుక్రవారం అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్‌, రమేశ్‌, ఎస్పీ రోహిణిప్రియదర్శినితో కలిసి ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలు, పార్కింగ్‌ స్థలాలు, ప్రయాణప్రాంగణాలు, వనదుర్గా ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ను నియత్రించాలన్నారు. చౌరస్తా వద్ద శాశ్వత ప్రాతిపదికన బస్టాండ్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పార్కింగ్‌ స్థలాలతో పాటు వనదుర్గా ప్రాజెక్టు, వంతెనలు, నదీపాయల ప్రమాద స్థలాల వద్ద బారికేడ్లు, సూచికలు ఏర్పాటు చేసి భక్తులను అటువైపు వెళ్లకుండా పోలీసులతో గస్తీ చేపట్టాలని చెప్పారు. గజ ఈతగాళ్లు, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలన్నారు. ఆలయ పరిసరాల్లో ఎల్‌ఈడీ దీపాలు బిగించాలని, విద్యుత్తు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతంలో వ్యర్థాలు పడేయకుండా పర్యవేక్షించాలని చెప్పారు. వనదుర్గా ప్రాజెక్టుకు ఈ నెల 10న ట్రయల్‌గా నీటిని వదిలి, 15న 0.450 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నీటిపారుదల అధికారులకు సూచించారు. అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ మర్యాదల ప్రకారం సత్కరించారు. నీటిపారుదల ఈఈ శ్రీనివాసరావు, డీపీవో సాయిబాబా, మత్స్యశాఖ ఏడీ రజనీ, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, పాలకమండలి ఛైర్మన్‌ బాలాగౌడ్‌, ఈవో శ్రీనివాస్‌, అధికారులు, తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని