logo

పల్లెకు సౌర కాంతులు

గ్రామాల్లో విద్యుత్తు దీపాల వల్ల బిల్లులు అధికంగా వస్తున్నాయి. బిల్లుల చెల్లింపు పంచాయతీలకు భారంగా మారుతోంది.

Published : 04 Feb 2023 01:49 IST

విద్యుత్తు బిల్లుల భారం తగ్గించేందుకు నిర్ణయం

న్యూస్‌టుడే, చేగుంట: గ్రామాల్లో విద్యుత్తు దీపాల వల్ల బిల్లులు అధికంగా వస్తున్నాయి. బిల్లుల చెల్లింపు పంచాయతీలకు భారంగా మారుతోంది. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు సౌర దీపాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కొన్ని పంచాయతీలను ఇటీవల జాతీయ అవార్డు కోసం ప్రతిపాదించగా.. అందులో క్లీన్‌ అండ్‌ ఎపోర్టబుల్‌ ఎనర్జీ కింద పది మార్కులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ముందుగా కొన్ని సోలార్‌ దీపాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో సోలార్‌ దీపాల సరఫరా బాధ్యతను అధికారులు ఓ ఏజెన్సీకి అప్పగించారు. వారే గ్రామ పంచాయతీలకు సరఫరా చేస్తున్నారు. దీపాల సామర్థ్యం ఆధారంగా ధర నిర్ణయించారు. ఒక వైపు సౌర పలక, మరో వైపు దీపాలున్న వాటిని విద్యుత్తు స్తంభాలకు బిగించనున్నారు. రిమోట్‌తో పనిచేసేలా ఏర్పాట్లు చేస్తారు. చేగుంటకు 25 సౌర దీపాలను తెప్పించారు. వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. వీటితో పాటు.. సెన్సార్‌తో పనిచేసే మరో 100 దీపాలనూ తీసుకొచ్చారు. చాలా గ్రామాల్లో పగటిపూటా.. విద్యుత్తు దీపాలు వెలుగుతున్నాయి. దీంతో బిల్లుల భారం పెరుగుతోంది. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు సెన్సార్‌తో పనిచేసే ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి రాత్రి కాగానే వాటంతట అవే వెలుగుతాయి. ఉదయం ఆరిపోతాయి. మొదటగా గ్రామపంచాయతీ, డంప్‌ యార్డు, వైకుంఠదామం వద్ద ఏర్పాటు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని