logo

అపురూపం.. ఆ జ్ఞాపకం

ఆయన చిత్రం.. సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక. కదిలిస్తే సాహిత్యం వినిపిస్తుంది.. నిండు రూపానికి నిదర్శనం.. అద్భుతమైన కళాఖండాలు తీర్చిదిద్దిన మహనీయుడు.. సామాజిక అంశాలపై తీసిన సినిమాలు అజరామరంగా నిలిచాయి.

Updated : 04 Feb 2023 06:32 IST

ఆయన చిత్రం.. సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక. కదిలిస్తే సాహిత్యం వినిపిస్తుంది.. నిండు రూపానికి నిదర్శనం.. అద్భుతమైన కళాఖండాలు తీర్చిదిద్దిన మహనీయుడు.. సామాజిక అంశాలపై తీసిన సినిమాలు అజరామరంగా నిలిచాయి. ప్రస్తుతం నింగికెగిసిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ గురించి ప్రతి ఒక్కరూ తలచుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.


చమత్కరిస్తూ.. సరదాగా నవ్వుతూ!

ఐఐటీ విద్యార్థులతో కలిసి కె.విశ్వనాథ్‌

ఈనాడు, సంగారెడ్డి: దిగ్గజ దర్శకుడు 2018 ఆగస్టు 23న కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ను సందర్శించారు. విద్యార్థుల ప్రశ్నలకు ఉత్సాహంగా, చమత్కారం కలిపి సమాధానాలు ఇచ్చారు. రెండు గంటల పాటు ముచ్చటించారు. తన సినిమాల గురించి, వాటి వెనుక ఉన్న ప్రేరణ, ఎక్కువ సినిమాలు ‘స’ అక్షరంతోనే మొదలైన ఎన్నో విషయాలను వివరించారు. ఆ రోజున ఉదయం 10 గంటలకు ఐఐటీ ప్రాంగణంలో ‘స్వర్ణకమలం’ చిత్రాన్ని ప్రదర్శించారు. ‘స్పిక్‌మెకే’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

* ‘నా సినిమాలు ఎక్కువగా ‘స’ అక్షరంతోనే మొదలవుతాయి. దీనికి ప్రత్యేక కారణం లేదు. ‘సినిమా రంగంలో చాలా సెంటిమెంట్లు ఉంటాయని’ ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

* ‘నేను ఎప్పటికప్పుడు మెరుగ్గా ఉండాలనే తపనతో పని చేశా. నేను ఏదో మార్చాలనో, ఇంకేదో ఉద్దేశంతో సినిమాల్లోకి రాలేదు. నేను మన సమాజం, చుట్టూ ఉండే వ్యక్తులను ఎంతో ఇష్టపడతా. అందుకే నా సినిమాలన్నీ మన చుట్టూ జరిగే సంఘటన లాగే ఉంటాయి. అందరూ మంచివారుగానే ఉంటారు. పరిస్థితుల వల్ల ఒక్కోసారి ఒక్కోలా మారుతుంటారు. అందుకే నా సినిమాల్లో బుర్రమీసాలు, గళ్లలుంగీ ఉన్న ప్రతినాయకులు కనిపించరు. కాలమే నా సినిమాల్లో విలన్‌’ అంటూ స్పష్టం చేశారు.


వయోలిన్‌ బంధం

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: బీవీఆర్‌ఐటీ కళాశాలలో పని చేస్తున్న సహాయ ఆచార్యురాలు నాగపరమేశ్వరి కుమార్తెలు సాయినేత్ర, సాయిశేషులుకు కె.విశ్వనాథ్‌తో కలిసి వయోలిన్‌ వాయించే అవకాశం దక్కింది. 2004లో హైదరాబాద్‌లోని ఓ మ్యూజిక్‌ అకాడమీలో వయోలిన్‌ వాయించడం నేర్చుకుంటున్నారు. ఆ సమయంలో వీరిద్దరికి అకాడమీ ద్వారా స్వరాభిషేకం సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. విశ్వనాథ్‌తో కలిసి పాట చిత్రీకరణలో వయోలిన్‌ వాయించడం మరుపురాని అనుభూతి అన్నారు.


సాగరసంగమం సినిమానే స్ఫూర్తి

న్యూస్‌టుడే, చేగుంట: సాగర సంగమం సినిమానే తనకు స్ఫూర్తి అని రామాయంపేటకు చెందిన ఐరేని అభినయకృష్ణ అలియాస్‌ అదిరే అభి తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘2017లో ఓ టీవీ ఛానెల్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన విశ్వనాథ్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నా. మీరు తీసిన సాగరసంగమం సినిమాను చూసి స్ఫూర్తి పొందాన’ని చెప్పాను. ఆ చిత్రంలోని నృత్యాలను చూసిన తర్వాతే ఆసక్తి పెరిగింది. భవిష్యత్తులో మంచి నటుడిగా ఎదుగుతావని ఆశీర్వదించారు. ఆయనకు ఆయనే సాటి అని, ఎంతో మందిని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లారు.


ఆత్మీయ అనుబంధం..

న్యూస్‌టుడే, శివ్వంపేట: కె.విశ్వనాథ్‌తో శివ్వంపేట మండలం పెద్దగొట్టిముక్లకు చెందిన హైదరాబాద్‌ లిటిల్‌ మ్యూజిషియన్‌ అకాడమీ వ్యవస్థాపకులు, సంగీత దర్శకుడు, గాయకుడు, సంగీత గురువు కొమండూరి రామాచారికి ఆత్మీయ అనుబంధం ఉంది. స్వరాభిషేకం విడుదల అయ్యాక ఆ సినిమా పాటలపై తెలుగు రాష్ట్రాల్లో రామాచారి సారథ్యంలో పోటీలు నిర్వహించారు. ఈటీవీ పాడుతాతీయగా తొలి సిరీస్‌లో శంకరాభరణం సినిమాలోని ‘రాగం.. తానం.. పల్లవి..’ పాట పాడారు. విశాఖపట్నంలో తన లిటిల్‌ మ్యూజిషియన్‌ విద్యార్థులతో కలిసి ఆయన గళం కలిపారు. ప్రజలకు ఆయన చిత్రాలే బోధనలుగా మారాయి. రామాచారి శిష్యులెంతో మంది విశ్వనాథ్‌ సినిమాల్లో పాడి ఆటక్టుకుంటున్నారు.  


ఇంటికెళ్లి.. పాట పాడి..

మెదక్‌ జిల్లా నార్సింగికి చెందిన కొక్కరకొండ శర్వాణి గాయకురాలిగా రాణిస్తున్నారు. రెండేళ్ల క్రితం దర్శకుడు విశ్వనాథ్‌ ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో స్వర్ణకమలం సినిమాలోని పాట పాడి వినిపించారు. ఆ తర్వాత మరో రెండు సార్లు ఆయన్ను కలవడం జీవితాంతం గుర్తిండిపోతుందని తెలిపారు.- నార్సింగి (చేగుంట)


మెలకువలు నేర్పి..

సాయిసిరి, పాటల రచయిత

న్యూస్‌టుడే, మెదక్‌: హైదరాబాద్‌లోని తెలుగు సాహిత్య పరిషత్‌లో 2012లో కొత్త రచయితలకు 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఇందులో నేను పాల్గొన్నా. దీనికి హాజరైన కె.విశ్వనాథ్‌ పలు అంశాల్లో మెలకువలు నేర్పారు. తెలుగు సాధారణ పదాలను పాటలో ఇనుమడింపజేస్తే ఎలా శబ్ద సౌందర్యం వస్తుందన్న విషయాన్ని వివరించారు. ఆయన సూచనలతో పలు సినిమాల్లో పాటలు రాయగలిగా. విశ్వనాథ్‌ మరణం తెలుగు సినిమాకు, కళారంగానికి తీరని లోటు. కళారంగంలో ఒక మునిలా ఎదిగిన అతను దర్వకత్వం వహించిన సినిమాల్లో ఎక్కడా అశ్లీలతకు తావులేకుండా ప్రతి ప్రేక్షకుడిని మదిలో చిరస్థాయిగా నిలిచే కళాకండాలను సృష్టించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని