logo

ప్రగతి బాట.. సంక్షేమకాంక్ష!

జిల్లాలో నీటిపారుదల, విద్య, వైద్యం, పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బీతో పాటు పలు శాఖల్లో నిధులు లేక చాలా చోట్ల పనులు మధ్యలో నిలిచాయి.

Published : 04 Feb 2023 01:49 IST

రాష్ట్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై జిల్లా వాసుల ఆశ

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, సంగారెడ్డి టౌన్‌, సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలో నీటిపారుదల, విద్య, వైద్యం, పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బీతో పాటు పలు శాఖల్లో నిధులు లేక చాలా చోట్ల పనులు మధ్యలో నిలిచాయి. కొన్ని చోట్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు పనులపై ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. శుక్రవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు నిధుల కేటాయింపుపై ప్రజలు ఆశ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కథనం.


పూర్తికాని వైద్య కళాశాల భవనాలు

సంగారెడ్డిలో ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. నిధులు పూర్తిస్థాయిలో కేటాయిస్తే వేగవంతం కానున్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాల భవనాల నిర్మాణాలు, వైద్య పరికరాలకు నిధులు రావాల్సి ఉంది. కొన్ని చోట్ల నిధుల కొరత వల్ల గుత్తేదార్లు పనులు మధ్యలోనే నిలిపివేశారు. కేసీఆర్‌ కిట్టు పథకంలో లబ్ధిదారులకు ప్రోత్సాహక మొత్తం సకాలంలో అందడం లేదు.


రవాణా సాఫీగా సాగాలంటే..

జిల్లాలో గతేడాది కురిసిన వర్షాలకు ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ శాఖల పరిధిలోని పల్లె, పట్టణదారులు చాటాచోట్ల దెబ్బతిన్నాయి. వంతెనలు శిథిలావస్థకు చేరాయి. వాటి మరమ్మతులకు మూడేళ్ల నుంచి నిధులు కేటాయించలేదు. ఈసారైనా నిధులు కేటాయిస్తేనే ప్రజా రవాణా సాఫీగా సాగనుంది.


ఎత్తిపోతలు, కొత్త చెరువులకు..

ఎత్తిపోతల పనులకు భూమి పూజ చేసిన సీఎం కేసీఆర్‌, మంత్రులు (పాతచిత్రం)

బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలతో జిల్లాను సస్యశ్యామలం చేయాలని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే ఆయా పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. డీపీఆర్‌(డిటేల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌) పూర్తయింది. భూసేకరణ కొనసాగుతోంది. ఆయా పనులకు టెండర్లు, ఒప్పందం పూర్తయింది. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే పనులకు మార్గం సుగమం అవుతుంది. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో ఎనిమిది కొత్త చెరువులు తవ్వేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఒక్కపైసా కేటాయించలేదు. వాటిపైనా ప్రభుత్వం దృష్టి సారించాలి. రెండేళ్లుగా వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపడితేనే అన్నదాతలకు ప్రయోజనం దక్కనుంది.


కీలకమైనవి మరికొన్ని..

* మహిళా పొదుపు సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలతో ఆర్థిక అభ్యున్నతికి బాటలు వేసుకుంటున్నారు. వీరిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు పథ]కాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద రావాల్సిన నిధులు 2019-20 నుంచి నిలిచిపోయాయి.

* బీసీ యువతకు స్వయం ఉపాధి కోసం 2017-18లో దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటివరకు 760 మందికి రూ.50వేల చొప్పున శతశాతం రాయితీపై అందజేశారు. మిగిలిన నిరుద్యోగ యువతకు రాయితీ కోసం రూ.కోట్లు అవసరం.

* పట్టణ ప్రగతి పేరుతో ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. పూర్తి స్థాయిలో మంజూరు కావడం లేదు. జిల్లాలోని అన్ని పురపాలిలకు నెలకు రూ.5.50 కోట్ల రావాల్సి ఉండగా రూ.3 కోట్లు మాత్రమే విడుదల చేస్తోంది. దీంతో చాలా వరకు పట్టణ ప్రగతి కింద చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలాయి.

* జిల్లాలో 8 బీసీ, 11 మైనార్టీ గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. బీసీ గురుకులాలకు కేటాయించిన మండలాల్లో భవనాలు లేకపోవడంతో సంగారెడ్డిలోనే అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని