logo

పురపాలికల్లో పన్నుల మోత!

జిల్లాలోని పురపాలికల్లోని నివాసాల నుంచి వసూలు చేసే పన్ను పెంచడంతో పట్టణవాసులపై ఆర్థిక భారం తప్పడం లేదు.

Updated : 05 Feb 2023 05:46 IST

జిల్లా కేంద్రంలోని ఓ భవనానికి కొలతలు వేస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, మెదక్‌ టౌన్‌: జిల్లాలోని పురపాలికల్లోని నివాసాల నుంచి వసూలు చేసే పన్ను పెంచడంతో పట్టణవాసులపై ఆర్థిక భారం తప్పడం లేదు. పురపాలికలకు మాత్రం ఆదాయం పెరిగింది. జిల్లాలో మెదక్‌ పురపాలికలో ఔరంగాబాద్‌, అవుసులపల్లి, పిల్లికొట్టాల గ్రామాలు 2018లో విలీనం కాగా, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌లు కొత్తగా పురపాలికలుగా అవతరించాయి. ఈ సమయంలో మూడేళ్ల వరకు పన్నులు పెంచమని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆ గడువు కాస్త ముగియడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన మేర పన్నులను వసూలు చేయనున్నారు.


పూర్తయిన సమగ్ర సర్వే

ఇళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు అంతర్జాలంలో నిక్షిప్తం చేసేందుకు ప్రభుత్వం భువన్‌ యాప్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని పురపాలికల్లో అధికారులు ఇంటింటికీ వెళ్లి సమగ్ర వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేశారు. ఇళ్లు ఎంత విస్తీర్ణం, ఎన్ని అంతస్తులు, ఖాళీ స్థలం ఎంత ఉందనే వివరాలు సేకరించి సీడీఎంఏ కార్యాలయానికి అనుసంధానం చేశారు. ప్రస్తుతం వివరాల ఆధారంగానే ఆస్తి పన్నుల్లో 0.25 శాతం వ్యత్యాసం ఉంటుంది.

* మెదక్‌ పురపాలికలో గతంలో ఆస్తి పన్ను లక్ష్యం రూ.4 కోట్లు ఉండగా.. ఈసారి రూ. 5.17 కోట్లకు పెరిగింది. నర్సాపూర్‌లో రూ.3 కోట్లకు రూ.50 లక్షలు పెరిగింది. రామాయంపేటలో గతంలో రూ.42.91 లక్షలు ఉండగా ఈ సారి రూ. 1.09 కోట్లుగా నిర్దేశించారు. తూప్రాన్‌లో రూ.1.19 కోట్ల నుంచి రూ.1.76 కోట్లకు పెరిగింది.


పెరిగిన ఆదాయం

జిల్లాలో నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట పురపాలికలు కొత్తగా ఏర్పడాయి. మూడేళ్ల వరకు ఇచ్చిన వెసులుబాటు ప్రకారం విలీనమైన గ్రామాల్లో, కొత్త వాటిల్లో మ్యానువల్‌ పద్ధతిలోనే పన్నులు వసూలు చేసేవారు. ప్రస్తుతం సీడీఎంఏకు అనుసంధానం చేయడంతో కొత్త విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల లక్ష్యం రూ.8.61 కోట్లు ఉండగా ఈ సారి రూ.11.52 కోట్లకు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని