logo

యువత చేతిలోనే దేశ భవిత

యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరూ చదువుకుని దేశానికి సేవలు అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.జి.ప్రియదర్శిని అన్నారు.

Published : 05 Feb 2023 02:04 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రియదర్శిని

బార్‌ అసోసియేషన్‌ భవనాన్ని ప్రారంభిస్తున్న న్యాయమూర్తి జస్టిస్‌ ప్రియదర్శిని, తదితరులు

న్యూస్‌టుడే, పరిగి, ధారూర్‌, బషీరాబాద్‌, వికారాబాద్‌ గ్రామీణం: యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరూ చదువుకుని దేశానికి సేవలు అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.జి.ప్రియదర్శిని అన్నారు. శనివారం వికారాబాద్‌ జిల్లా, పరిగి పట్టణంలోని కోర్టు ఆవరణలో నిర్మించిన బార్‌ అసోసియేషన్‌ భవనాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి యువత సేవలు ఎంతో అవసరమని, కానీ ఎక్కువగా సెల్‌ఫోన్ల వినియోగంతో పక్కదాని పడుతున్నారని, వాటిని పక్కకు పెట్టి చదువుకోవాలని సూచించారు. సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని అన్నింటా సమానంగా దూసుకెళ్లాలని తెలిపారు. పరిగిలో బార్‌ అసోసియేషన్‌ కోరిక మేరకు అదనపు కోర్టుతో పాటు కొత్త భవనం ప్రారంభానికి కృషి చేస్తామన్నారు. జిల్లా ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌, సెషన్స్‌ జడ్జి కె.సుదర్శన్‌ మాట్లాడుతూ పని ప్రదేశంలో వసతులు ఉంటే మరింత ఉల్లాసంగా పనిచేసేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ న్యాయమూర్తి డీబీ శీతల్‌, పరిగి, వికారాబాద్‌ న్యాయమూర్తులు వి.హరికుమార్‌, కె.శ్రీకాంత్‌, పరిగి, వికారాబాద్‌ బార్‌ అసోయేషన్‌ అధ్యక్షులు కె.నరేంద్రయాదవ్‌, మాధవరెడ్డి, ఏఎస్పీ మురళీధర్‌రావు, డీఆర్వో అశోక్‌కుమార్‌, ఆర్డీఓ విజయకుమారి, బార్‌ అసోయేషన్‌ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.


పద్మనాభుని ఆలయ సందర్శన..

వికారాబాద్‌లో ఆహ్లాదకర వాతావరణంలో వెలసిన అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రియదర్శిని అన్నారు. ఆలయ సందర్శనకు వచ్చిన ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత తెలియజేసిన అనంతరం స్వామివారి చిత్రపటం అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె 14 కి.మీ దూరంలోని కోట్‌పల్లి ప్రాజెక్టును సందర్శించారు. రక్షణ కోట్‌ ధరించి పడవలో ప్రయాణం చేశారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని