logo

తరుగు బాధలు ఉండవిక!

రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సరఫరా చేస్తున్న బియ్యం తూకం పక్కాగా ఉండేలా ఈ పోస్‌ విధానం అమలు చేస్తున్నారు.

Published : 05 Feb 2023 02:04 IST

ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద ఈ-పోస్‌ యంత్రాలు

సంగారెడ్డి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోదాములో నిల్వలను పరిశీలిస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సరఫరా చేస్తున్న బియ్యం తూకం పక్కాగా ఉండేలా ఈ పోస్‌ విధానం అమలు చేస్తున్నారు. దీనివల్ల లబ్ధిదారులకు తరుగు లేకుండా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ దుకాణాలకు చేరుతున్న బియ్యం బస్తాలో తరుగుపై రేషన్‌ డీలర్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బస్తాలోనూ తరుగు ఉంటుండటమే దీనికి కారణం. ఇక మీదట ఆ ఇబ్బందులు దూరం కానున్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోదాముల్లోనూ ఈ-పాస్‌ యంత్రాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కథనం.


ఎట్టకేలకు కదలిక

బయోమెట్రిక్‌ విధానం అమలులో ఉండటంతో కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యం ఎలక్ట్రానిక్‌ తూకపు యంత్రంపై పెట్టి సరితూగినప్పుడే రసీదు ప్రింట్‌ రూపంలో వస్తుంది. బియ్యం తక్కువగా ఉంటే రసీదు వచ్చే అవకాశం ఉండదు. దీంతో లబ్ధిదారులకు ఒక్క గ్రాము బియ్యమైనా తగ్గకుండా ఇవ్వాల్సిందే. దీనివల్ల కార్డుదారులకు సక్రమంగా సరఫరా అవుతోంది. డీలర్లకు పంపిణీ చేసే బియ్యంలో తరుగు ఉండటంతో వారు నష్ట పోవాల్సి వస్తోంది. తరుగుకు సరిపడా బియ్యం కేటాయించాల్సి ఉన్నా అదీ.. జరగడం లేదు. దీనిపై నిలదీస్తే ఎక్కడ డీలర్‌ పదవికి ఎసరు పెడతారోనని భయంతో ఏమీ చేయలేకపోతున్నామని పలువురు డీలర్లు వాపోయారు. తరగు విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు రేషన్‌ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో విజ్ఞప్తులు చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించంతో పాటు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో ఈ-పాస్‌ విధానాన్ని అమలులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఒకేసారి 50 క్వింటాళ్ల బియ్యం తూకం

ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు పెద్ద పీట వేసేలా సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌ విధానంలో భాగంగా గోదాముల్లో ఒకే సారి 50క్వింటాళ్ల బియ్యం తూకం వేసేలా ఎలక్ట్రానిక్‌ కాంటాలను ఏర్పాటు చేశారు. రేషన్‌ డీలర్‌తోపాటు వారి కుటుంబంలోని ముగ్గురికి సంబంధించిన వివరాలను యంత్రంలో నమోదు చేశారు. ఏ ఒక్కరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోదాముకు వచ్చినా సరిపోతుంది. తమకు కేటాయించిన బియ్యం కోటాకు అనుగుణంగా తూకం వేయించుకుని ఈ-పోస్‌ యంత్రంపై వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.


* జిల్లాలో సివిల్‌ సప్లయ్‌ గోదాములు: 6
* రేషన్‌ దుకాణాలు: 845
* ఆహార భద్రత కార్డులు: 3.78లక్షలు
* బియ్యం కోటా: 5,500 మెట్రిక్‌ టన్నులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని