logo

నెలల వ్యవధిలో తండ్రీకుమారులు మృతి

ఏడు నెలల వ్యవధిలోనే అనారోగ్యంతో తండ్రీకొడుకులు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Published : 06 Feb 2023 01:45 IST

ఏ ఆసరా లేక ఆవేదనలో కుటుంబం

న్యూస్‌టుడే, దుబ్బాక: ఏడు నెలల వ్యవధిలోనే అనారోగ్యంతో తండ్రీకొడుకులు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దుబ్బాక పట్టణంలోని 16వ వార్డులో సుంకోజు నాగభూషణం అనే వృద్ధుడు 50 సంవత్సరాలుగా వండ్రంగి పని చేసేవాడు. భార్య, కుమారుని సహాయంతో నలుగురు ఆడపిల్లలకు పెళ్లి చేశాడు. ఈ క్రమంలో నాగభూషణం అనారోగ్యంతో గత సంవత్సరం జూన్‌లో మరణించాడు. తండ్రి మరణంతో కుంగిపోయిన కుమారుడు సత్యనారాయణ (38) కుల వృత్తిని నమ్ముకొని, చేతి నిండా పని కరవై, అప్పులతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఈయనకు భార్య, పదకొండేళ్ల వయసు లోపు ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు. మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైన సత్యనారాయణ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. ఒక వైపు భర్త మరణం, మరో వైపు కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న చెట్టంత ఎదిగిన కొడుకు మృతి చెందడంతో, తల్లి రాజమణి విషాదంలో ఉన్నారు. భర్త సత్య నారాయణ మృతి చెందడంతో, భార్య నవ్య, పిల్లలు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. వారి పేదరికంతో కుటుంబం గడవడం, పిల్లల చదువులు కొనసాగడం ఇబ్బందికరమయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు, వడ్రంగి సంఘం దుబ్బాక అధ్యక్షుడు సుంకోజు శంకర్‌ కోరుతున్నారు.

తండ్రి మృతితో ఆవేదనలో పిల్లలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని