logo

చిరుధాన్యాలు.. ఆరోగ్య సిరులు

చిరుధాన్యాలు.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుత ఆధునిక జీవనంలో ఆరోగ్య రక్షణకు వీటిని తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.

Published : 06 Feb 2023 01:45 IST

న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌, జహీరాబాద్‌

వంటకాల గురించి వివరిస్తున్న మహిళలు

చిరుధాన్యాలు.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుత ఆధునిక జీవనంలో ఆరోగ్య రక్షణకు వీటిని తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు నిరుపేదల ఆకలి తీర్చిన చిరుధాన్యాలకు మళ్లీ మహర్దశ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్న చిరుధాన్యాల వంటకాలు, పోషక విలువలు, పాత పంటల సాగుపై జహీరాబాద్‌లోని డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ- కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తాధ్వర్యంలో జాతర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా వాటితో తయారుచేసే వంటకాల తీరుపై అవగాహన కల్పిస్తుండటం విశేషం.

తొలిసారి..

ఐక్యరాజ్య సమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. దీని వెనుక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన డీడీఎస్‌, మిల్లెట్స్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా కృషి ఉంది. డీడీఎస్‌ రెండు దశాబ్దాలుగా పాత పంటల రుచులను కెఫే గ్రీన్‌ ఎథ్నిక్‌ పేరుతో దేశంలోనే తొలి చిరుధాన్యాల హోటల్‌ నడుపుతోంది. దీనికితోగా ఐదేళ్ల నుంచి సముదాయ ఉత్పత్తి కేంద్రం నిర్వహిస్తూ ఇన్‌స్టంట్‌ మిక్స్‌లు, రెడీ టు ఈట్‌ ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తోంది.

వంటలు, పోషక విలువలపై..

తృణ ధాన్యాలు కాదు ఆరోగ్యపు సిరిధాన్యాలుగా ప్రాచుర్యం పొందుతున్న పాత పంటలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు డీడీఎస్‌, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా జహీరాబాద్‌ డివిజన్‌లోని ఆరు గ్రామాల్లో వంటకాలు, పోషకాలపై గ్రామీణ మహిళా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ పొలాల్లో మిశ్రమ విధానంలో పండించే చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలతో వివిధ రకాల పాత వంటలు మహిళలు వండుకొని తీసుకొస్తున్నారు.


సలహాలు, సూచనలు

చిరుధాన్యం వంటకాలు, పోషక విలువలు, ఆరోగ్య పరిరక్షణకు అందించే తోడ్పాటుపై కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త హేమలత మహిళా రైతులు, గృహిణులకు అవగాహన కల్పిస్తున్నారు. మహిళలకు ముందస్తు సమాచారం ఇచ్చి ఇళ్లలో అందుబాటులో ఉన్న చిరుధాన్యాలతో వంటలు తయారు చేసి తీసుకొచ్చేలా సూచనలు చేస్తున్నారు. వాటిని ప్రదర్శిస్తూ పాత పంటల ప్రాముఖ్యత, వంటలతో ఉపయోగాలపై మహిళలకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. వృద్ధ మహిళలు తమ అనుభవాలను మూడు తరాల కొత్త కోడళ్లకు వివరిస్తున్నారు.


50 రకాల ప్రదర్శన

పౌష్టికాహార అవగాహన సదస్సుల్లో మహిళలు 50 రకాలకు పైగా ఆహార పదార్థాలను తయారు చేసి తీసుకొస్తున్నారు. తైద, పజ్జోన్న, సాయిజొన్న, బెరికే రొట్టెలు, కొర్ర బువ్వ, సామ బువ్వ, యవ్వ పాయసం, జొన్న అంబలి, నువ్వుల పోలెలు, సజ్జ మలిద, బెబ్బరి గుడాలు వంటి వంటలతో పాటు దొగ్గలి కూర, ఓమా కూర, పుంటి కూర వంటి సహజ ఆకుకూరలు కలిపి మొత్తంగా 50కి పైగా వంటలు, కూరలు తయారు చేసి ప్రదర్శన చేపడుతున్నారు. పరస్పరం బదిలీ చేసుకొని కలిసి భోజనం చేస్తున్నారు.


ఆరోగ్యానికి భరోసా..
హేమలత, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త, కేవీకే జహీరాబాద్‌

ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్న చిరుధాన్యాల వంటకాలు, పోషక విలువలు, పాత పంటల సాగుపై పోషకాహార వారోత్సవాల్లో అవగాహన కల్పిస్తున్నాం. మహిళా రైతులు పాత పంటల సాగును కొనసాగించేలా కృషి చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని