logo

ఆలయ భూములు పరాధీనం

రాజకీయ పరపతిని అడ్డుపెట్టుకొని ఆలయ భూములను ఆక్రమిస్తున్నా.. పట్టించుకునే వారే కరవయ్యారు. రెండు నెలలుగా దందా యథేచ్ఛగా సాగుతోంది. క్రమంగా కడీలు పాతుతూ.. ఆక్రమణకు యత్నిస్తున్నారు.

Published : 06 Feb 2023 01:45 IST

కంది మండలం బేగంపేటలో దందా
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, కంది

ఆక్రమణకు గురైన స్థలాలు

రాజకీయ పరపతిని అడ్డుపెట్టుకొని ఆలయ భూములను ఆక్రమిస్తున్నా.. పట్టించుకునే వారే కరవయ్యారు. రెండు నెలలుగా దందా యథేచ్ఛగా సాగుతోంది. క్రమంగా కడీలు పాతుతూ.. ఆక్రమణకు యత్నిస్తున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో రూ.కోట్ల విలువైన ఆలయ భూములు పరాధీనమవుతున్న తీరుపై కథనం.

కంచె వేసి.. కడీలు పాతారు

కంది మండలం బేగంపేటలో అనంత పద్మనాభస్వామి దేవాలయం ఉంది. ఈ పురాతన మందిరానికి సర్వే నంబరు 249లో ఆరెకరాల భూమి ఉంది. ఇక్కడ ఎకరా రూ.2 కోట్లు విలువ పలుకుతోంది. ఈ లెక్కన రూ.12 కోట్ల విలువైన స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. రెండు నెలల క్రితం రాజకీయ పలుకుబడి ఉన్న స్థానిక నేతలు ఆలయ భూముల చుట్టూ కంచె వేసి కడీలు పాతారు. స్థానికంగా పరపతి కలిగిన వ్యక్తులు కావడంతో ఎవరూ అడ్డుచెప్పడం లేదనే ఆరోపణలున్నాయి.

చెరువు కింద మూడు ఎకరాలు

కంది మండలం చిద్రుప్పలోని పెద్ద చెరువు కింద అనంత పద్మనాభస్వామి దేవాలయానికి చెందిన 3.1 ఎకరాల భూమి సర్వే నంబర్‌ 575, 423, 424, 416లలో ఉంది. ఇక్కడి భూములపైనా కొందరు కన్నేశారు. ఎకరా రూ.కోటి విలువ చేసే రూ.మూడు కోట్ల విలువైన భూమి ఆక్రమార్కుల చేతిలోకి వెళుతున్నా.. పట్టించుకునే వారే కరవయ్యారనే విమర్శలున్నాయి.


విచారణ చేసి చర్యలు తీసుకుంటాం
-సుధాకర్‌రెడ్డి, జిల్లా సహాయ కమిషనర్‌,  దేవాదాయశాఖ

కంది మండలం బేగంపేటలో అనంత పద్మనాభస్వామి దేవాలయానికి చెందిన భూములు ఆక్రమణకు గురైన విషయంపై క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాం. విచారణ చేస్తాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. ఆయా భూముల వద్ద పాతిన కడీలను తొలగించి స్వాధీనం చేసుకుంటాం. వ్యవసాయ భూములను అర్చకులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని