logo

పంచాయతీలకు నిధులు.. కొనసాగుతున్న పనులు

గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, మురుగు కాలువలు మెరుగుపడనున్నాయి. ఉపాధిహామీ పథకం కింద మెటీరియల్‌ కాంపోనెంట్ నిధులు రూ.60 కోట్లు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు ఇటీవల జారీ చేసింది.

Updated : 07 Feb 2023 06:19 IST

రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి రూ.60 కోట్లు
న్యూస్‌టుడే, గజ్వేల్‌గ్రామీణ

అక్కారంలో వేస్తున్న రహదారి

గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, మురుగు కాలువలు మెరుగుపడనున్నాయి. ఉపాధిహామీ పథకం కింద మెటీరియల్‌ కాంపోనెంట్ నిధులు రూ.60 కోట్లు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు ఇటీవల జారీ చేసింది. పల్లె ప్రగతి, 15వ ఆర్థిక సంఘం నిధులు సరిపోక ఇబ్బందుల్లో ఉన్న పాలకవర్గాలకు తాజాగా మంజూరు కావడం కొంత ఊరటనిచ్చింది. గతేడాది ఇదే పథకం కింద రూ.62 కోట్లతో చేయగా బిల్లుల చెల్లింపు ఆలస్యమైంది. మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాలో 499 పంచాయతీలకు ఉపాధి పథకంలో మురుగు కాల్వలు సీసీ రోడ్ల నిమిత్తం ఏటా నిధులను విడుదల చేస్తున్నారు. కూలీల చెల్లింపులకు 40 శాతం, నిర్మాణ సామగ్రికి 60 శాతం నిధులు కేటాయిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సూచనతో కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉన్న కమిటీ ప్రతిపాదనలు పంపించడంతో మంజూరు చేశారు. రహదారుల నిర్మాణంలో ఎంపీడీవో, పీఆర్‌ ఇంజినీరింగ్‌ అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారు. గతంలో హడావిడిగా చేయడంతో కొన్నిచోట్ల నాణ్యత లోపించింది. ఆర్థిక సంవత్సరం లోపు చేయకపోతే నిధులు వెనక్కి వెళతాయి. రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి రూ.60 కోట్లు మంజూరయ్యాయని సిద్దిపేట పంచాయతీరాజ్‌ ఈఈ శ్రీనివాస్‌రావు చెప్పారు.

తాత్కాలికం వద్దు.. శాశ్వతం ముద్దు

న్యూస్‌టుడే, దుబ్బాక: దుబ్బాక పట్టణం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్‌అండ్‌బీ తారు రహదారులు అక్కడక్కడా గుంతలు, కంకర తేలాయి. వాహనదారులు తిప్పలు పడుతున్నారు. పట్టణం నుంచి చేర్వాపూర్‌ మీదుగా హబ్షీపూర్‌కు వెళ్లే దారిపై రామసముద్రం చెరువు కట్ట వద్ద గుంతలు ఏర్పడ్డాయి. రెణ్నెల్ల క్రితం మంత్రుల పర్యటన సందర్భంగా తాత్కాలిక మరమ్మతులు చేశారు. ప్రస్తుతం మళ్లీ అదే దశకు రోడ్లు చేరాయి. దుబ్బాక నుంచి లచ్చపేటకు వెళ్లే మార్గంల పెద్దమ్మ గుడి ముందుతారు రోడ్డుపై కంకర తేలింది. ఇటీవల దుబ్బాక ముదిరాజ్‌ సంఘం ప్రతినిధులు రెండు సార్లు గుంతల్లో మట్టి పోసి, పూడ్చారు. పెద్ద చెరువు అడుగు నుంచి నీరు లీకేజీ అవుతుండటంతో రోడ్డు బురదగా మారుతోంది. దుబ్బాక నుంచి దుంపలపల్లి దారి అస్తవ్యస్తంగా తయారైంది. దుబ్బాక-ముస్తాబాద్‌ రెండు వరుసల రహదారి నిర్మాణానికి అతి త్వరలోనే రూ.13 కోట్లతో పనులు ప్రారంభించనున్న ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని పట్టణవాసులు కోరుతున్నారు.


పిట్ట గోడ లేని కల్వర్టు

మిరుదొడ్డి పట్టణంలో ప్రధాన రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులతో చేపట్టింది. రహదారి పూర్తయి సంవత్సరం గడుస్తున్నా పెద్ద చెరువు కట్టు కాలువపై కల్వర్టుకు పిట్ట గోడను నిర్మించలేదు. దీనివల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

న్యూస్‌టుడే, మిరుదొడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని