logo

ప్రగతి రథం.. ప్రమాద రహితం

ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో ఎనిమిది డిపోలు ఉండగా 238 అద్దె బస్సులు నడుస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో మూడు డిపోల పరిధిలో 147 అద్దె సర్వీసులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి.

Published : 07 Feb 2023 04:14 IST

ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణ
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, మెదక్‌ అర్బన్‌, వికారాబాద్‌ టౌన్‌

ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో ఎనిమిది డిపోలు ఉండగా 238 అద్దె బస్సులు నడుస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో మూడు డిపోల పరిధిలో 147 అద్దె సర్వీసులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. నాలుగు జిల్లాల పరిధిలో 623 ప్రైవేటు డ్రైవర్లు పని చేస్తున్నారు. వీరందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే డిపోల వారీగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పనితీరు మెరుగుపై సలహాలు, సూచనలతో రోజంతా తర్ఫీదు ఇస్తూ వారిలో మార్పునకు ప్రయత్నిస్తున్నారు.

మర్యాద, సురక్షితం

ప్రధాన రెండు అంశాల ప్రాతిపదికన శిక్షణ ఇస్తున్నారు. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించడం ప్రధానం. చోదకు విషయాన్ని విస్మరిస్తే ప్రయాణికులకు అసౌకర్యానికి గురికావడమే కాకుండా మరోసారి బస్సు ప్రయాణం అంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రయాణికులకు ఆకట్టుకుంటేనే సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. సురక్షిత డ్రైవింగ్‌ విషయంలోనూ నిర్లక్ష్యం వద్దని, ఒత్తిడిని అధిగమించే మార్గాలపై అవగాహన కల్పిస్తున్నారు.

మెదక్‌లో అవగాహన కల్పిస్తున్న అధికారి

ప్రజలకు ఆర్టీసీపై నమ్మకం ఎక్కువ. సొంత వాహనాలున్నా అత్యధికులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు మొగ్గుచూపుతుంటారు. మరోవైపు అక్కడక్కడ ప్రమాదాలు చోటుచేసుకోవడం సంస్థకు మచ్చ తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయం పెంపుతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యంగా యాజమాన్యం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇస్తుండటం గమనార్హం.

ఏం నేర్పిస్తారంటే..

* ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితిని వివరించడంతో పాటు జీతభత్యాలు, ఆదాయం, ఖర్చులపై అవగాహన.
* సంస్థ నష్టాల నుంచి ముందడుగు వేసేందుకు ప్రతి ఉద్యోగి నిర్వహించాల్సిన పాత్రపై చర్చ.
* ప్రస్తుత పోటీ వాతావరణానికి అనుగుణంగా ఏ సంస్థలోనైనా మార్పు అవసరం. లేదంటే మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఉదాహరణలతో వివరిస్తూ పోటీ వాతావరణంలో నిలదొక్కుకునేలా కార్యోన్ముఖులను చేయడం.
* ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం.
* విధుల్లో ఉన్న సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. అనవసర విషయాలపై దృష్టిసారిస్తే ఏకాగ్రత కోల్పోతారని తెలియజేయడం.
* సానుకూలంగా ఆలోచించే వారు శ్రద్ధ, ఆత్మవిశ్వాసం, ఓపిక, విజయం కలిగి ఉంటారని, ఉద్యోగులు విధి నిర్వహణ సమయంలో సానుకూల ఆలోచనతో ఉంటే సంస్థకు ఆదాయం తద్వారా ఉద్యోగులకు ఉండే ప్రయోజనాలు వివరించడం.
* ప్రయాణికులతో మాట్లాడే విధానం మార్చుకోవడంతో పాటు సమయపాలన పాటించడం ముఖ్యమని శిక్షణలో భాగంగా సూచిస్తారు.


మార్పు వస్తోంది..

సుదర్శన్‌, ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్‌

ఉద్యోగుల్లో మార్పుతో సంస్థ పురోగతి సాధ్యమన్న ఉద్దేశంతో సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తర్ఫీదు పూర్తయిన వారిలో మార్పు గమనిస్తున్నాం. ప్రయాణికులతో సిబ్బంది గౌరవంగా ఉంటున్నారు. దీనివల్ల అత్యధికులు బస్సులో ప్రయాణించేందుకు వీలుంటుంది.


ఒత్తిడిని అధిగమించేలా..

మధు, మెదక్‌

బస్సు నడుపుతున్నప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండాలని శిక్షణలో భాగంగా అవగాహన కల్పించారు. రహదారి భద్రత నియమాలు వివరించారు. ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. కేఎంపీఎల్‌ పెంచి ఆదాయం రాబట్టేందుకు పలు సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని