logo

లంచం ఇస్తావా.. స్థలం రాసిస్తావా?: రైతును డిమాండ్‌ చేసిన ఆర్‌ఐ

రైతు భూమిని పట్టాదారు పాసు పుస్తకంలోకి ఎక్కించేందుకు లంచం డిమాండ్‌ చేసిన మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండల గిర్దావర్‌(రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌) అనిశా వలలో చిక్కుకున్నారు.

Updated : 07 Feb 2023 08:16 IST

అనిశా వలలో చిన్నశంకరంపేట గిర్దావర్‌

చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే: రైతు భూమిని పట్టాదారు పాసు పుస్తకంలోకి ఎక్కించేందుకు లంచం డిమాండ్‌ చేసిన మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండల గిర్దావర్‌(రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌) అనిశా వలలో చిక్కుకున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా అనిశా డీఎస్పీ ఆనంద్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సంగాయపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ కుటుంబానికి సర్వే నం.1313లో 22 గుంటల సాగు భూమి ఉంది. పాత పట్టాదారు పాసు పుస్తకంలో ఆ వివరాలు ఉన్నప్పటికీ, కొత్త పుస్తకంలో నమోదు కాలేదు. విషయాన్ని ఆర్‌ఐ శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, రూ.2 లక్షలు ఇస్తే పనిచేసి పెడతానని తెలిపారు. అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో, ‘నీ పొలం పక్కనే నాకు ఓ ప్లాటు ఉందని, అందులో కలుపుకొనే విధంగా 18 గజాల స్థలం ఇచ్చి, ఆ మేరకు రూ.2 లక్షల్లో మినహాయించుకోమని తెలిపారు.

చివరకు రూ.లక్షకు ఒప్పందం చేసుకొని, పొలాన్ని పట్టాదారు పాసు పుస్తకంలో పొందుపరిచారు. చందంపేట గ్రామ వీఆర్‌ఏ సురేష్‌బాబును మధ్యవర్తిగా ఉంచి, లంచం డబ్బు కోసం శ్రీనివాస్‌పై ఒత్తిడి పెంచారు. జనవరి 5న ఉమ్మడి మెదక్‌ జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌.. శ్రీనివాస్‌ను కలిసి విషయం వివరించారు. ముందస్తు వ్యూహంలో భాగంగా, సోమవారం అదే మండలంలోని రుద్రారం గ్రామ శివారులో ఆర్‌ఐ శ్రీహరి, వీఆర్‌ఏ సురేష్‌బాబులకు డబ్బు అందజేశాడు. అనిశా అధికారులను గమనించిన ఇద్దరూ ద్విచక్రవాహనంపై పారిపోతుండగా వెంబడించి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరినీ తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సీఐలు వెంట్‌రాజ్‌గౌడ్‌, రమేష్‌లు డీఎస్పీ వెంట ఉన్నారు.

స్వాధీనం చేసుకున్న నగదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని