logo

వినతుల సమర్పణ.. పరిష్కారానికి కార్యాచరణ

సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ గ్రామాల నుంచి అర్జీదారులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అధికారులకు వినతులు సమర్పించారు.

Published : 07 Feb 2023 04:14 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు

సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ గ్రామాల నుంచి అర్జీదారులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అధికారులకు వినతులు సమర్పించారు. పాలనాధికారి శరత్‌, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఆయా శాఖ అధికారులు ఆయా కౌంటర్ల ద్వారా అర్జీలు స్వీకరించారు. వీటిల్లో భూ సమస్యలే ఎక్కువ. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను పాలనాధికారి శరత్‌ ఆదేశించారు.

పంటలు నీట మునుగుతున్నాయి..

సింగూరు కాల్వలను మరమ్మతు చేయాలంటూ ఫోరం ఫర్‌ బెటర్‌ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్‌, చందంపేట గ్రామ రైతులు హనుమాదాస్‌, రామస్వామి, శంకరయ్య పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. కాల్వలకు గండ్లు పడటంతో రైతుల పంటల పొలాలు నీట మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. నీటి ప్రవాహ నియంత్రణకు కాలువపై వాల్వులు ఏర్పాటుచేయాలని కోరారు.
* భూ సమస్యను పరిష్కరించాలని పటాన్‌చెరుకు చెందిన ప్రవీణ్‌, బాలయ్య వట్‌పల్లికి చెందిన సంగమేశ్‌ కోరారు.
* రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయాలని సంగారెడ్డికి చెందిన విమలమ్మ, నారాయణ కోరారు.
* బ్యాంకు రుణం మంజూరు చేసి ఆదుకోవాలని చౌటకూరుకు చెందిన ప్రకాశ్‌ విజ్ఞప్తి చేశారు.
* బాలిక సంరక్షణ పథకం కింద సాయం వెంటనే అందించాలని జహీరాబాద్‌ మండలం రంజోల్‌కు చెందిన రమేశ్‌రెడ్డి కోరారు.


కార్తీక్‌రెడ్డిని కౌశిక్‌రెడ్డిగా మార్చారు

వెంకట్‌రెడ్డి, పర్వతాపూర్‌

నా కుమారుడి పేరు కార్తీక్‌రెడ్డి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ధరణి పోర్టల్‌లో కౌశిక్‌రెడ్డిగా నమోదయింది. అధికారులు చేసిన తప్పు సరిచేయడంలేదు. మండల కార్యాలయంలో అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చా. కలెక్టర్‌కు ఫిర్యాదుచేస్తే స్పందన ఉంటుందన్న ఆశతో ఇక్కడిదాకా వచ్చా. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలి.


‘ఆసరా’ ఇప్పించరూ

లక్ష్మణ్‌రావు, ఉసిరికపల్లి

57 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి పింఛను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తు చేశా. పింఛను మంజూరుకు అవసరమైన అర్హతలు ఉన్నా నా పేరు జాబితాలో లేదు. మండల స్థాయిలో అధికారులను అడిగితే కలెక్టరేట్‌లో తెలుసుకోవాలని సూచించారు. ఇక్కడికి వస్తే మళ్లీ మండల కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్నారు. అధికారుల తీరు సరికాదు.


ఆన్‌లైన్‌లో వివరాలు సరి చేయాలి

- శంకరయ్య, ఎర్దనూరు

ధరణి పోర్టల్‌లో పాత రికార్డుల ప్రకారం వివరాలను నమోదుచేయాల్సి ఉండగా అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. తమ భూమి వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంతో బ్యాంకు అధికారులు పంట రుణం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వివరాలు నమోదుచేసి న్యాయం చేయాలి.


పింఛన్‌ కోసం..

ఈనాడు, సంగారెడ్డి: కోహీర్‌ మండలానికి చెందిన సత్తార్‌ లారీ డ్రైవర్‌. ఆయనకు మూడు నెలలుగా పింఛన్‌ ఆగిపోవడంతో తన స్నేహితుడు రహమాన్‌తో కలిసి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. అధికారులకు తమ సమస్యను విన్నవించారు. వచ్చె నెల నుంచి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని