logo

చకచకా పనులు.. తప్పనున్న ప్రమాదాలు

ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో 44వ జాతీయ రహదారిపై చేగుంట సమీపంలో బైపాస్‌ సర్కిల్‌ వద్ద ఉపరితల వంతెన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పనులు చురుకుగా సాగుతున్నాయి.

Published : 07 Feb 2023 04:14 IST

న్యూస్‌టుడే, చేగుంట

ఉపరితల వంతెన నిర్మించే ప్రాంతం

ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో 44వ జాతీయ రహదారిపై చేగుంట సమీపంలో బైపాస్‌ సర్కిల్‌ వద్ద ఉపరితల వంతెన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇటీవల కేంద్రం నిధులు మంజూరు చేయడంతో మరింత జోరందుకున్నాయి.

నాలుగు వరుసలుగా..

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకున్న 44 జాతీయ రహదారి జిల్లాలో మనోహరాబాద్‌, తూప్రాన్‌, మాసాయిపేట, చేగుంట, నార్సింగి, రామాయంపేట మండలాల మీదుగా వెళ్తోంది. 2006 వరకు రెండు వరుసలుగా ఉండేది. ఈ సమయంలో జిల్లాలో ఆయా మండలాల పరిధిలో జాతీయ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యం. ఆ తర్వాత నాలుగు వరుసలకు విస్తరించడంతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. చేగుంట వద్ద రెడ్డిపల్లి బైపాస్‌ సర్కిల్‌ వద్ద మాత్రం పరిస్థితి అలాగే ఉంది. రోడ్డు దాటుతున్న సమయంలో దుర్ఘటనలు జరిగాయి. ఇక్కడ ఉపరితల వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు కేంద్రం స్పందించి రెండేళ్ల కిందట వంతెన మంజూరు చేసింది. జాతీయ రహదారి ప్రాదికార సంస్త టెండర్లు పూర్తిచేసి గతేడాది పనులను ప్రారంభించారు.

వంతెన నిర్మాణ పనులు

సర్వీస్‌ రహదారి

ఈ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం ఉపరితల వంతెన పనులు సాగుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇరువైపులా సర్వీసు రోడ్డు వేశారు. ఈ మార్గాలు భవిష్యత్తులో చేగుంటకు వచ్చి వెళ్లేందుకు ఉపయోగపడనున్నాయి. ఏడాదిలో వంతెన నిర్మాణం పూర్తిచేసే కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. పలకలు బిగించే పనులు సాగుతున్నాయి.

జప్తిశివునూర్‌ వద్ద..

నార్సింగి మండలం జప్తిశివునూర్‌ వద్ద కూడా కేంద్రం వంతెనను మంజూరు చేసింది. ఇందుకు రూ. 29 కోట్లు కేటాయించింది. ఇక్కడ నెల కిందట సదరు పనులు షూరు అయ్యాయి. ప్రస్తుతం సర్వీసు దారితో పాటు అవసరం ఉన్న చోట చిన్న వంతెనలు విస్తరిస్తున్నారు. ఇక ఈ రెండు పూర్తయితే ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ప్రయాణం సాఫీగా సాగించే వీలుంటుంది.


ఎంతోమందికి మేలు: నరేందర్‌

చేగుంట బైపాస్‌ సర్కిల్‌ వద్ద రాకపోకలకు భయంగా ఉండేది. ముఖ్యంగా రోడ్డు దాటుతున్న సమయంలో ఎక్కడి నుంచి వాహనం వేగంగా వచ్చి ఢీకొంటుందనే ఆందోళన. ఉపరితల వంతెన నిర్మాణంతో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఎంతోమందికి మేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని