logo

ఆత్మస్థైర్యం.. రక్షణకు దోహదం

ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, విద్యార్థినులపై అకృత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినుల ఆత్మరక్షణ విద్య నేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 08 Feb 2023 02:03 IST

విద్యార్థినులకు కరాటే శిక్షణ
న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట, మెదక్‌ అర్బన్‌, చిలప్‌చెడ్‌

గౌతాపూర్‌లో సాధన చేస్తున్న విద్యార్థినులు

ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, విద్యార్థినులపై అకృత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినుల ఆత్మరక్షణ విద్య నేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు తమని తాము రక్షించుకునేందుకు అవసరమని గుర్తించి ఈ దిశగా అడుగులు వేయడం గమనార్హం. నాలుగేళ్ల కిందట బాలికలకు కరాటే శిక్షణ ఇవ్వగా పలు కారణాలతో నిలిచిపోయింది. తిరిగి దాన్ని పునరుద్ధరించారు.

190 పాఠశాలల్లో..

ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థినులు చదువుతో పాటు కరాటేలో తర్ఫీదు పొందేందుకు అవకాశం దక్కింది. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో 924 సర్కారు బడులు ఉన్నాయి. తొలి విడతలో ఎంపిక చేసిన 127 జడ్పీ బాలికల ఉన్నత, 6 ఉన్నత, 15 కస్తూర్బాలు, 42 ప్రాథమికోన్నత పాఠశాలల్లో నేర్పిస్తున్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ‘రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ ప్రశిక్షణ్‌’ కార్యక్రమం దీన్ని ప్రారంభించారు. జనవరి 24న మొదలవగా.. నెలరోజుల పాటు ఇస్తున్నారు. ఇన్‌స్ట్రక్టర్లుగా ఏజెన్సీల ద్వారా నియమించుకొని రూ.5 వేల చొప్పున పాఠశాల నుంచి చెల్లించేలా  రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. 10 వేల మంది తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రమే అవకాశాన్ని కల్పించారు.

ధీమా పెంచేలా..

ఏదైనా అనుకోని ఘటన ఎదురైనా బాలికలు తమని తాము రక్షించుకునే ఆత్మవిశ్వాసం, ధీమా పెంచేందుకు కరాటే శిక్షణ తోడ్పడుతుంది. ఇప్పటికే పట్టణాల్లో కొంతమంది ప్రైవేటుగా ఫీజు చెల్లిస్తూ కరాటేలో శిక్షణ పొందుతున్నారు. గతంలో సర్వశిక్షా అభియాన్‌ ద్వారా నిధులిచ్చి తరగతులు నిర్వహించారు. కానీ కరోనా ప్రభావం అనంతరం ఇది కాస్త అటకెక్కింది. యుద్ధ విద్యలైన కుంగ్‌ఫూ, కరాటే, జూడో వంటివి నేర్పించేలా శిక్షకులను నియమించారు. జనవరి 24న ప్రారంభించగా నెల రోజుల పాటు కొనసాగించనున్నారు. నిత్యం గంట పాటు తర్ఫీదు ఇస్తున్నారు. కనీసం ఆరునెలల పాటు అవకాశం కల్పిస్తే వారు ఏమైనా నేర్చుకునే అవకాశం లభిస్తుందని శిక్షకులు చెబుతున్నారు.


ఏ రంగంలోనైనా..
-జ్యోతి, జిల్లా బాలికల సంరక్షణ అధికారిణి

జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో బాలికలకు ఉచిత కరాటే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం నెలరోజుల పాటు బడుల్లో కార్యక్రమం కొనసాగనుంది. పిల్లల్లో నమ్మకం పెంచుతుంది. దీంతో ఏ రంగాల్లోనైనా రాణించే అవకాశం ఏర్పడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని