logo

అధ్యయనం.. అవగాహనతో చైతన్యం

మహిళల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ.. వారిలో చైతన్యాన్ని తెచ్చేందుకు ‘స్వార్డ్‌’ స్వచ్ఛంద సంస్థ ఓ అధ్యయనాన్ని చేపట్టింది. ‘యోష’ అనే సంస్థ సహకారంతో ‘మెనోపాజ్‌’ (నెలసరి ఆగిపోయే దశ) గుర్తించడం సహా దాని పరిణామాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనుంది.

Updated : 08 Feb 2023 05:52 IST

‘మెనోపాజ్‌’పై మహిళలకు ఆరోగ్య పాఠాలు
న్యూస్‌టుడే, సిద్దిపేట, మెదక్‌

మెదక్‌లో రిసోర్సుపర్సన్‌లకు అవగాహన కల్పిస్తున్న సంస్థ ప్రతినిధులు, అధికారులు

మహిళల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ.. వారిలో చైతన్యాన్ని తెచ్చేందుకు ‘స్వార్డ్‌’ స్వచ్ఛంద సంస్థ ఓ అధ్యయనాన్ని చేపట్టింది. ‘యోష’ అనే సంస్థ సహకారంతో ‘మెనోపాజ్‌’ (నెలసరి ఆగిపోయే దశ) గుర్తించడం సహా దాని పరిణామాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనుంది. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో పది చొప్పున ప్రాంతాలను ఎంపిక చేసుకొని నిర్దేశిత వయసుల వారిని గుర్తించి.. విజ్ఞానంతో కూడిన మార్పు వైపు నడిపించనుంది. ఆరోగ్య పాఠాలు వల్లెవేయనున్నారు. ప్రతి ఒక్క మహిళ రుతుచక్రంలో చివరగా ఎదురయ్యే సహజమైన జీవ ప్రక్రియ ‘మెనోపాజ్‌’ అని నిపుణులు చెబుతారు. 40 - 55 ఏళ్ల మధ్య వయసుల వారికి సంభవిస్తుంది. వరుసగా నెలల పాటు రుతుక్రమం (నెలసరి) రాకపోతే మెనోపాజ్‌ దశకి చేరుకున్నట్లే. కొంత మందికి వయసుతో సంబంధం లేకుండా ముందుగా.. మరికొందరికి కొంత ఆలస్యంగా ఎదుర్కొంటున్నారు. అనేక మార్పులు కనిపిస్తుంటాయి. సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట మండలం మల్యాల, జక్కాపూర్‌, గుర్రాలగొంది, గోపులాపూర్‌, శంకరయ్యకుంట, చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌, చెర్లఅంకిరెడ్డిపల్లి, మల్లారం, రామునిపట్ల, ఓబులాపూర్‌, సిద్దిపేట పరిధి కాళ్లకుంట కాలనీని అవగాహన కార్యక్రమాలకు ఎంపిక చేశారు. మెదక్‌ జిల్లాలో చీకోడ్‌, కొంపల్లి, కొత్తలింగాయపల్లి, పాత లింగాయపల్లి, రామతీర్థం, ముద్దాపురం, కందిపల్లి, మల్లంపేట, నర్సింగరావుపల్లి తండా, మోదులకుంట తండా ఉన్నాయి. ఇప్పటికే నారాయణరావుపేట మండలం గుర్రాలగొందిలో కార్యక్రమం మొదలెట్టారు. నెల రోజుల పాటు చైతన్య పథాన్ని కొనసాగించనున్నారు.


ఇరు జిల్లాల్లో 500 మంది ఎంపిక

గుర్రాలగొందిలో మహిళకు రక్తపోటు పరీక్షలు నిర్వహిస్తూ..

తొలుత ఆయా ప్రాంతాల్లో ప్రధానంగా 40 - 55 సంవత్సరాల వయస్నున్న మహిళలను గుర్తిస్తారు. అందుకు ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఏఎన్‌ఎంల సహకారంతో ఈ ప్రక్రియ చేపడతారు. అలా రెండు జిల్లాల నుంచి 500 మందిని ఎంపిక చేస్తారు. ఎక్కడికక్కడ బ్యాచ్‌ల వారీగా అవగాహన కల్పిస్తారు. మెనోపాజ్‌ లక్షణాలు, ఎదురయ్యే మానసిక, శారీరక ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కుటుంబ సభ్యుల సహకారంపై  చెబుతారు. ఆరోగ్య సలహాలు సూచిస్తారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సహకారంతో రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయిస్తారు. పౌష్టికాహారం తీసుకోవాల్సిన ప్రాధాన్యత, యోగా, ధ్యాన సాధనతో ఒనగూరే ప్రయోజనాలు వివరిస్తారు. మార్చి 5వ తేదీ వరకు ఇదో అధ్యయనంగా కొనసాగుతుంది. తద్వారా ఫలితాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. నడివయసు మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వార్డ్‌ కార్యదర్శి శివకుమారి అన్నారు. మెనోపాజ్‌ గుర్తించడం, అధిగమించడం, ఇతరత్రా అనేక అంశాలపై తెలుసుకోవచ్చని తెలిపారు. ఇందుకు అనుగుణంగా మహిళలకు పరీక్షలు చేయిస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు