logo

పళ్లెమంత చారు.. చెంచాడంత కూర

తమకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ప్రిన్సిపల్‌ను తొలగిస్తేనే పాఠశాలలోకి వెళ్తామని రామాయంపేట కస్తూర్బా విద్యార్థినులు మంగళవారం ఆందోళనకు దిగారు.

Published : 08 Feb 2023 02:03 IST

ప్రిన్సిపల్‌ను తొలగించాలని విద్యార్థినుల ఆందోళన

పాఠశాల ఎదుట బైఠాయించిన విద్యార్థినులు, అభావిప నాయకులు

రామాయంపేట: తమకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ప్రిన్సిపల్‌ను తొలగిస్తేనే పాఠశాలలోకి వెళ్తామని రామాయంపేట కస్తూర్బా విద్యార్థినులు మంగళవారం ఆందోళనకు దిగారు. పాఠశాల ఎదుట బైఠాయించి గంటన్నర పాటు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. 160 మంది పిల్లలు ఉండగా.. ఎనిమిది లీటర్ల పాలు తెప్పిస్తున్నారన్నారు. దీంతో ఎవరికీ సరిపోవడం లేదని, ఇంత మందికి 6 నుంచి 8 కిలోల కూరగాయలు మాత్రమే వండుతున్నారన్నారు. ఓ చెంచాడు కూర వేసి, మిగతా అంతా చారు పోస్తున్నారన్నారు. అన్నం తినలేకపోతున్నామని, ఉదయం అల్పాహారం సైతం సరిగా ఉండటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వారిని ప్రిన్సిపల్‌ వేధిస్తున్నారని తెలిపారు. మాంసం వడ్డించడం లేదని, గుడ్లు చిన్నగా ఉంటున్నాయన్నారు. విషయం తెలుసుకున్న పుర ఛైర్మన్‌ జితేందర్‌గౌడ్‌ విద్యాలయానికి చేరుకుని విద్యార్థినులతో సమస్యలపై ఆరా తీశారు. గతంలో ఎమ్మెల్యే పాఠశాలను సందర్శించిన సమయంలోనూ విషయం చెప్పినా ప్రయోజనం లేకపోయిందన్నారు. దీంతో పుర ఛైర్మన్‌.. డీఈవో రమేష్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి, మరో ఉపాధ్యాయురాలికి బాధ్యత అప్పగిస్తున్నామని చెప్పడంతో విద్యార్థినులు శాంతించారు. విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు