logo

ఒడిశా కార్మికులకు విముక్తి

సీఐడీ అదనపు డీజీపీకి ట్విట్టర్‌ ద్వారా అపరిచిత వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఇటుకబట్టీలో నిర్బంధించిన ఆరుగురు ఒడిశా కార్మికులకు సీఐడీ పోలీసులు విముక్తి కల్పించారు.

Published : 08 Feb 2023 02:03 IST

సీఐడీ అదనపు డీజీపీకి ట్విట్టర్‌లో ఫిర్యాదు

వివరాలు వెల్లడిస్తున్న ఉమ్మడి మెదక్‌ జిల్లా సీఐడీ ఏఎస్పీ జి.వెంకటేశ్వర్లు చిత్రంలో కార్మికులు

మెదక్‌ రూరల్‌, న్యూస్‌టుడే: సీఐడీ అదనపు డీజీపీకి ట్విట్టర్‌ ద్వారా అపరిచిత వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఇటుకబట్టీలో నిర్బంధించిన ఆరుగురు ఒడిశా కార్మికులకు సీఐడీ పోలీసులు విముక్తి కల్పించారు. స్థానిక గ్రామీణ ఠాణాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా సీఐడీ ఏఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. మెదక్‌ పట్టణం నవాబుపేటకు చెందిన తుమ్మల లక్ష్మీనారాయణ మెదక్‌ మండలం మాచవరంలో ఇటుకబట్టీ నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని బొలంగీర్‌ జిల్లా రాఘవబదార్‌కు చెందిన గత్‌వాల్‌ రాణా, ముకుంద్‌రాణా, సురేంద్రరాణా, సుదమ్‌రాణా, ప్రకాశ్‌రాణా, నీరు బధోయ్‌ రెండేళ్ల కిందట మాచవరానికి తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నాడు. గత కొంత కాలంగా కూలీ డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదు. నివాస ప్రాంతంలో తగిన వసతులు కల్పించకుండా, స్వస్థలాలకు వెళ్లనివ్వకుండా, బంధువులకు కనీసం ఫోన్లు చేయనివ్వకుండా నిర్బంధించి వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి సోమవారం సీఐడీ అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్‌కు ట్వీట్‌ చేశారు. స్పందించిన ఆయన విచారణ చేపట్టాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా సీఐడీ ఏఎస్పీ వెంకటేశ్వర్లును ఆదేశించారు. నర్సాపూర్‌ సహాయ కార్మికశాఖ అధికారి సత్యేంద్ర ప్రసాద్‌, గ్రామీణ సీఐ విజయ్‌, ఆర్‌ఐ నాగరాజులతో కలిసి సీఐడీ ఏఎస్పీ మంగళవారం ఇటుక బట్టీపై దాడి చేసి, కార్మికులకు విముక్తి కల్పించారు. లక్ష్మీనారాయణపై 14(1), 1986 చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. బట్టి యజమాని నుంచి రూ.37,000ను కార్మికులకు ఇప్పించారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సహకారంతో కార్మికులను స్వస్థలాలకు పంపారు. సమావేశంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా సీఐడీ డీఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు, సీఐలు జగదీశ్వర్‌, సురేష్‌, సతీశ్‌కుమార్‌, జయేష్‌కుమార్‌, ఎస్‌ఐలు కృష్ణమూర్తి, అంజయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని