logo

ప్రత్యేక నిధి.. పనులు నెమ్మది!

గతేడాది సీఎం కేసీఆర్‌ నారాయణఖేడ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేశారు. ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలు కేటాయిస్తామని ప్రకటించి, మౌలిక వసతులు కల్పించుకోవాలని సూచించారు.

Published : 08 Feb 2023 02:03 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, నారాయణఖేడ్‌,  జహీరాబాద్‌, జోగిపేట టౌన్‌

కిషన్‌నాయక్‌తండాలో సీసీరోడ్డు నిర్మించాల్సిన కాలనీ

గతేడాది సీఎం కేసీఆర్‌ నారాయణఖేడ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేశారు. ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలు కేటాయిస్తామని ప్రకటించి, మౌలిక వసతులు కల్పించుకోవాలని సూచించారు. దీంతో  క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే నెలలు గడుస్తున్నా, అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వాటి ప్రగతిపై పరిశీలన కథనం.

జిల్లాలో గత జులైలో 2,479 పనులకు రూ.121.90 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోంచి ప్రతి పంచాయతీకి నిధులు కేటాయించారు. పంచాయతీరాజ్‌ శాఖ పర్యవేక్షణలో పనులు చేపట్టాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటిల్లో అత్యధికంగా సీసీ రోడ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే జాప్యం కొనసాగుతోంది. ప్రస్తుతం అనువైన సమయం.. వాటిని త్వరగా చేపట్టి పూర్తి చేస్తే ప్రజల ప్రయాణం సాఫీగా సాగేందుకు వీలు పడుతుంది. నిధులు ఇచ్చినందుకు సార్థకత ఉంటుంది.


క్షేత్ర స్థాయిలో పరిస్థితి

* సంగారెడ్డి నియోజకవర్గంలో 340 పనులకు రూ.17.20 కోట్లు ఇచ్చారు. వాటిలో ఇప్పటి వరకు 33 పూర్తి చేయగా, 32 ప్రగతిలో ఉన్నాయి. 275 ఇంకా ప్రారంభం కాకపోవడం గమనార్హం.

జహీరాబాద్‌ నియోజకవర్గంలో 638 పనులకు రూ.28.10 కోట్లు విడుదల చేయగా, 31 పనులు పూర్తి చేయగా 74  ప్రగతిలో ఉన్నాయి. 533 పనులకు ఇంకా తట్ట్టెడు మట్టి తీయలేదు.

* నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో 832 పనులకు రూ.37.60 కోట్లు కేటాయించారు. 143 పనులు ప్రారంభించగా 78 ప్రగతిలో ఉండగా 611 పనులకు ఇంకా అతీగతీలేదు. పనులను చేపట్టేందుకు పంచాయతీల పాలకవర్గాలు వెనుకడుగు వేస్తున్నాయి. గతంలో చేసిన పనుల బిల్లులు పెండింగులో ఉండటానికి తోడు అసెంబ్లీ ఎన్నికలకు 10 నెలలే సమయం ఉండటంతో చేసిన పనులకు సకాలంలో బిల్లుల వస్తాయా రావా అనే సందేహంతో వెనుకడుగు వేస్తున్నారు. అప్పు తెచ్చి పనులు చేయిస్తే వడ్డీ భరించే పరిస్థితిలేకపోవడంతో ఆసక్తి చూపడంలేదు.

* అందోలు నియోజకవర్గంలో 454 పనులకు రూ.28 కోట్లు మంజూరు చేశారు. 42 పనులు ప్రారంభించగా, 67 పనులు ప్రగతి దశల్లో ఉన్నాయి. 345 పనులు ప్రారంభానికి నోచలేదు. అన్నసాగర్‌లో బిల్లులు రావని పనులు చేపట్టలేదు. నేరడిగుంటలో ప్రతిపక్ష పార్టీ కావడం వల్ల నిధులు ఇవ్వలేదని సర్పంచి వాపోతున్నారు. 


మార్చిలోపు పూర్తి చేసేందుకు కృషి
జగదీశ్వర్‌, పీఆర్‌ ఈఈ, సంగారెడ్డి.

జిల్లాలో ఇప్పటికే ఉపాధి, మనఊరు- మనబడి కార్యక్రమంతోపాటు ఎస్‌డీఎఫ్‌ పనులు కొనసాగుతున్నాయి. మార్చి 31లోపు ఆయా పనులు పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకున్నాం. బిల్లుల సమస్య లేదు. ప్రస్తుతం ఆయా పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఇంకా వేగంగా పెంచేలా చర్యలు తీసుకుంటాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు